- ఛాలెంజర్స్, తెలంగాణ టైగర్స్ ఔట్
- హోరాహోరీ పోరాటం.. నరాలు తెగే ఉత్కంఠ
నారాయణ విద్యా సంస్థల సహకారంతో జరుగుతున్న స్ప్రైట్ ఈనాడు ఛాంపియన్ క్రికెట్ (ఈసీసీ) కప్- 2017 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతర్ రాష్ట్ర మహిళల క్రికెట్ టోర్నీకి అదిరిపోయే ఆరంభం. హోరాహోరీ పోరాటం.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన తొలి మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. పురుషుల క్రికెట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు నువ్వానేనా అన్నట్లు తలపడినా చివరికి సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్‌పై హైదరాబాద్ హీరోస్‌దే పైచేయి అయింది. మరో మ్యాచ్‌లో తెలంగాణ టైగర్స్‌పై రాయలసీమ రాకర్స్ గెలుపొందింది. అనంతరం తీసిన డ్రాలో హైదరాబాద్ హీరోస్‌కు ఫైనల్ బెర్తు దక్కింది. మరో ఫైనల్ బెర్తు కోసం రాయలసీమ రాకర్స్, నార్త్ ఆంధ్ర నింజాస్ సెమీస్‌లో తలపడతాయి. సెంట్రల్ ఆంధ్ర, తెలంగాణ టైగర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
బుధవారం మల్లారెడ్డి వైద్య కళాశాల (సూరారం కాలనీ) మైదానంలో జరిగిన అంతర్ రాష్ట్ర మహిళల నాకౌట్ మ్యాచ్‌లో హైదరాబాద్ హీరోస్ 13 పరుగుల ఆధిక్యంతో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ హీరోస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసింది. లక్ష్మీ ప్రసన్న (34; 44 బంతుల్లో 4శ్రీ4, 1శ్రీ6), త్రిష పూజిత (31; 27 బంతుల్లో 5శ్రీ4), అనురాధ నాయక్ (26; 29 బంతుల్లో 4శ్రీ4) సత్తాచాటారు. అనంతరం సెంట్రల్ ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 105 పరుగులు చేసింది. నవ్య దుర్గ (35; 43 బంతుల్లో 3శ్రీ4), హెప్సిబా (33; 34 బంతుల్లో 4శ్రీ4) పోరాడినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో రాయలసీమ రాకర్స్ 10 వికెట్ల తేడాతో తెలంగాణ టైగర్స్‌పై నెగ్గింది. రాయలసీమ బౌలర్లు పద్మజ (4/12), హంస (2/0), చంద్రిక (2/5) విజృంభించి జట్టుకు విజయాన్ని అందించారు.
ఫైనల్లో నార్త్ ఆంధ్ర!: జూనియర్స్ విభాగంలో నార్త్ ఆంధ్ర నింజాస్‌కు ఫైనల్ బెర్తు దాదాపుగా ఖాయమైంది. ఇప్పటికే రాయలసీమ రాకర్స్ (6) ఫైనల్లో అడుగుపెట్టగా.. మరో ఫైనల్ బెర్తు కోసం నార్త్ ఆంధ్ర (4), హైదరాబాద్ హీరోస్ (4), తెలంగాణ టైగర్స్ (4)ల మధ్య పోటీ నెలకొంది. గురువారం నార్త్ ఆంధ్ర, రాయలసీమ రాకర్స్‌ల మధ్య చివరి మ్యాచ్ జరుగనుంది. ఐతే మెరుగైన నెట్ రన్‌రేట్ కలిగిన నార్త్ ఆంధ్ర చివరి మ్యాచ్‌లో గెలిస్తే మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఓడిపోయినా ఆ జట్టుకు నష్టం ఉండదు! కాబట్టి నార్త్ ఆంధ్ర ఫైనల్లో అడుగుపెట్టడం లాంఛనమే. మరోవైపు బుధవారం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన జూనియర్స్ మ్యాచ్‌లో తెలంగాణ టైగర్స్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఆంధ్ర 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు చేసింది. భాను సాయి (59; 37 బంతుల్లో 6శ్రీ4, 2శ్రీ6) మెరిశాడు. అనంతరం తెలంగాణ టైగర్స్ 18.4 ఓవర్లలో 6 వికెట్లకు 119 పరుగులు సాధించింది. సాయి కృష్ణ (70 నాటౌట్; 56 బంతుల్లో 8శ్రీ4, 1శ్రీ6) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.
సీనియర్స్‌లో పోటాపోటీ: సీనియర్స్ విభాగంలో రెండో ఫైనల్ బెర్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 4 మ్యాచ్‌ల్లో విజయాలతో హైదరాబాద్ హీరోస్ (8) ఇప్పటికే ఫైనల్లోకి దూసుకెళ్ళింది. రెండో ఫైనల్ బెర్తు కోసం సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ (4), నార్త్ ఆంధ్ర నింజాస్ (4), రాయలసీమ రాకర్స్ (2)ల మధ్య పోటీ నెలకొంది. గురువారం నార్త్ ఆంధ్ర, రాయలసీమ జట్ల మ్యాచ్ చివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో నార్త్ ఆంధ్ర గెలిస్తే నేరుగా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఓడితే మూడు జట్లు నాలుగేసి పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ప్రస్తుతానికి 3 జట్ల రన్‌రేట్‌లు కాస్త అటుఇటుగా సమానంగానే ఉండటంతో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇక బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్ ఆంధ్ర 10 వికెట్ల తేడాతో తెలంగాణ టైగర్స్‌పై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన తెలంగాణ 18.4 ఓవర్లలో 86 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెంట్రల్ ఆంధ్ర 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 87 పరుగులు సాధించింది. లోకేశ్ (50 నాటౌట్; 30 బంతుల్లో 9శ్రీ4, 1శ్రీ6), అఖిల్ (35 నాటౌట్; 22 బంతుల్లో 4శ్రీ4, 1శ్రీ6) సత్తాచాటారు.
స్ప్రైట్ ఈసీసీ కప్‌లో ఈనాడు
మహిళల విభాగం: వేదిక: మల్లారెడ్డి వైద్య కళాశాల
సెమీస్: రాయలసీమ రాకర్స్ x నార్త్ ఆంధ్ర నింజాస్
సమయం: ఉదయం 10 నుంచి
ఫైనల్: హైదరాబాద్ హీరోస్ x సెమీస్ విజేత
సమయం: మధ్యాహ్నం 2 నుంచి
పురుషుల విభాగం: వేదిక: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల
జూనియర్స్: నార్త్ ఆంధ్ర నింజాస్ x రాయలసీమ రాకర్స్
సమయం: ఉదయం 10 నుంచి
సీనియర్స్: నార్త్ ఆంధ్ర నింజాస్ x రాయలసీమ రాకర్స్
సమయం: మధ్యాహ్నం 2 నుంచి
మహిళల మ్యాచ్‌లు
హైదరాబాద్ హీరోస్: 117/3 (లక్ష్మీ ప్రసన్న 34; త్రిష పూజిత 31; అనురాధ నాయక్ 26; నవ్య దుర్గ 2/19, కవిత 1/20), సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్: 105/7 (నవ్య దుర్గ 35, హెప్సిబా 33, లక్ష్మీ ప్రసన్న 1/14, ప్రవిష 1/10, చిత్ర మహేశ్వరి 1/7), బీ తెలంగాణ టైగర్స్: 21 (అశ్విని 13, పద్మజ 4/12, హంస 2/0, చంద్రిక 2/5), రాయలసీమ రాకర్స్: 22/0 (ప్రవళిక 11 నాటౌట్, చంద్రిక 9 నాటౌట్)
పురుషుల మ్యాచ్‌లు
జూనియర్స్: సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్: 115/8 (భాను సాయి 59, పృథ్వీ 11, ఫయాజుద్దీన్ 3/26, ముజాహిద్ 2/15), తెలంగాణ టైగర్స్: 119/6 (సాయి కృష్ణ 70 నాటౌట్, ఫయాజుద్దీన్ 12, పృథ్వీ 2/24, శంకర్ 1/12)
సీనియర్స్: తెలంగాణ టైగర్స్: 86 (వెంకటేశ్ 15 నాటౌట్, నవరసన్ 17, రఘురాం 3/6, మోసిన్ 2/21, లోకేశ్ 2/24), సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్: 87 (లోకేశ్ 50 నాటౌట్, అఖిల్ 35 నాటౌట్)