పసిడి ధరలు భారీగా పడిపోయాయి. బులియన్‌లో 10 గ్రాముల 24 కారెట్ల బంగారం రూ.430 తగ్గింది. రూ.32,020 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో స్వర్ణం విలువ భారీగా పడిపోవడం, స్థానిక నగల వ్యాపారులు బంగారం కొనుగోళ్లపై అనాసక్తి ప్రదర్శించడంతో పసిడి ధరలు తగ్గాయి. ఇక, వెండి కూడా అదే బాటలో పయనించింది. భారీగా పతనమవ్వకపోయినప్పటికీ కిలో వెండిపై రూ.250 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.40,650 వద్ద ఉంది. పరిశ్రమలు, నాణేల తయారీదారులు చాలా తక్కువగా బంగారం, వెండిని కొనుగోలు చేస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక, వెండి నాణేల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 100 నాణేల అమ్మకం ధర రూ.75 వేలు, కొనుగోలు ధర రూ.76 వేల వద్దే స్థిరంగా ఉంది. కాగా, అమెరికా మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1300 డాలర్లకు దిగువకు వచ్చిన నేపథ్యంలోనే పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 1290.30 డాలర్ల వద్ద ప్రస్తుతం బంగారం ట్రేడ్ వుతోంది. డాలరు విలువ భారీగా పెరగడం పసిడి ధరలను ప్రభావితం చేసిందంటున్నారు బులియన్ నిపుణులు. ఇక, ఇటు వెండి ధర కూడా ఔన్సుకు 1.52 శాతం తగ్గి 16.24 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.