రాజమహేంద్రవరం
కరోనా వేవ్ ల వల్ల ఆర్టీసీ రూ.5,680 కోట్ల మేర నష్టపోయిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి చెప్పారు. డీజిల్ ధరల పెరుగుదలతో మరింత భారం పడిందని తెలిపారు. అయినా కూడా ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ ఆర్టీసీని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కో దక్కుతుందన్నారు. కరోనా వల్ల ఆర్టీసీకి రూ.5,680 కోట్ల నష్టం వాటిల్లిందని.. డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో రోజుకు రూ.320 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీని అప్పుల బారి నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తే.. ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్య లను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మల్లికార్జునరెడ్డి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఈడీ చింతా రవికుమార్, కోనసీమ డీపీటీవో ఆర్వీఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.