అమరావతి
ప్రభుత్వానికి ఖనిజ ఆధారిత ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇప్పటికే గనులశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు సంస్కరణలను తీసుకువచ్చామన్నారు. మైనింగ్ లీజుల విషయంలో అత్యంత పారదర్శకతను అమలులోకి తీసుకువస్తూ ఈ-ఆక్షన్ విధానంను ప్రవేశపెట్టామని అన్నారు.సచివాలయంలోని మూడోబ్లాక్లో గనులు, అటవీ, పర్యావరణశాఖ అధికారులతో మైనింగ్ లీజులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గనులశాఖ ద్వారా ఈ-ఆక్షన్ లో మైనింగ్ అనుమతులను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించామని, దీనివల్ల ఔత్సాహికులు పలువురు మైనింగ్ రంగంలోకి వస్తున్నారని అన్నారు. ఇదే క్రమంలో గతంలో మైనింగ్ లీజులకు దరఖాస్తులు చేసుకుని, పర్యావరణ, అటవీ అనుమతులు లేక మైనింగ్ చేపట్టకుండా ఉన్న లీజులపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
పర్యావరణ, అటవీ, గనులశాఖల మధ్య సమన్వయం ఉంటేనే పెండింగ్ లీజుల విషయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. గనుల శాఖ నుంచి లీజులు పొందినప్పటికీ అటు పర్యావరణ, అటవీ శాఖల నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారని, వారికి ఎదురవుతున్న ప్రతిబంధకాలను పరిశీలించాలని కోరారు. పెండింగ్లో ఉన్న లీజుల్లో మైనింగ్ ప్రారంభించినట్లయితే అటు ప్రభుత్వానికి రెవెన్యూ లభిస్తుందని, ఇటు పర్యావరణ శాఖకు కూడా సిఎఫ్ఓ, సిఎఫ్ఇల ద్వారా ఫీజు రూపంలో ఆదాయం లభిస్తుందని సూచించారు.