విజయవాడ, ఏప్రిల్ 20,
అంతన్నాడు.. ఇంతన్నాడు.. ఉత్తరాంధ్రకు సామంత రాజునన్నాడు.. ఆ మూడు జిల్లాలు తనవే అన్నాడు. తాడేపల్లి ప్యాలెస్ తనకు రాసిచ్చిందని విర్రవీగాడు. పవర్ అంతా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. బదిలీలు, బెదిరింపులు, కబ్జాలు, కుట్రలు.. ఒక్కటేమిటి మూడేళ్లుగా అక్కడంతా విజయసాయి మయం. కట్ చేస్తే.. తాజాగా విజయసాయి కోరలు పీకేశారు జగన్‌రెడ్డి. ఆయనను విశాఖ నుంచి తప్పించేశారు. వైవీ సుబ్బారెడ్డికి విశాఖ పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ.. విజయసాయికి మరెక్కడా ఇంఛార్జ్‌గా నియమించకుండా పక్కన పెట్టేసి.. బిగ్ షాక్ ఇచ్చారు జగన్‌రెడ్డి. అదే సమయంలో.. మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డిలకు ఏకంగా 9 జిల్లాల పరిధిలోని 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించి వారి ప్రాధాన్యం మరింత పెంచేశారు. విజయసాయిరెడ్డి స్థానంలో వైవీ సుబ్బారెడ్డికి.. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకూ పార్టీ, ప్రభుత్వం తరఫున ఆ బాధ్యతలు చూసిన విజయసాయిపై సొంతపార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం.. భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో విజయసాయికి చెక్ పెట్టక తప్పలేదంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భూ ఆక్రమణలకు సంబంధించి పలు ఆరోపణలతో పాటు.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నేతలు జగన్‌కు ఫిర్యాదులు చేయడం.. స్వయంగా స్పీకర్ తమ్మినేని సీతారం, మంత్రి బొత్సలకు సైతం సాయిరెడ్డి నుంచి పలుమార్లు అవమానాలు జరగడంతో.. ఆయన ఓవరాక్షన్ మరీ ఎక్కువైందనే విషయాన్ని తాడేపల్లి గుర్తించినట్టుంది. అందుకే, వేటు వేసిందని అంటున్నారు. విశాఖలో ఉంటే చేదాటిపోతున్నారని భావించి.. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతల పేరుతో సాయిరెడ్డిని తాడేపల్లికి రప్పించి.. జగన్ కనుసన్నల్లో ఉండేలా కట్టడి చేశారని అంటున్నారు. ఇక, సజ్జలను మరో విజయసాయిగా చేస్తున్నారు జగన్మోహన్‌రెడ్డి. ఆయనకు మరింత ప్రాధాన్యం ఇచ్చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతలతో పాటు.. పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే కీలక పవర్స్ అప్పగించారు. వైసీపీలో పదవుల పంపకాల్లో జగన్ మార్క్ చూపించారు. 11మందికి పార్టీ ప్రాంతీయ సమన్వయ బాధ్యతలు అప్పగించగా, 26 జిల్లాలకూ కొత్త అధ్యక్షులను నియమించారు. 11మంది ప్రాంతీయ సమన్వయకర్తల్లో ఆరుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో జగన్‌రెడ్డి ప్రయారిటీ ఏంటో స్పష్టం అవుతోంది. ఇక, పునర్‌వ్యవస్థీకరణలో మంత్రి పదవులు కోల్పోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్‌లకు పార్టీ ప్రాంతీయ సమన్వయ బాధ్యతలనిచ్చారు. మిగిలిన 10మందికి వారి జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను కట్టబెట్టారు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు పార్థసారథి, ఉదయభాను, శిల్పా చక్రపాణిరెడ్డిలు ఇప్పటివరకు వారికున్న పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల నుంచి సైతం తొలగించడం మరింత అసంత్రుప్తిని రాజేసినట్టైంది.