ఏప్రిల్ 21,
ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు. 15 రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. పగలు ఉక్కపోత, వడగాల్పులతో జనం తల్లడిల్లుతున్నారు. అర్ధరాత్రి దాటితే గానీ ఉక్కపోత తగ్గడం లేదు. ముఖ్యంగా కణేకల్లు, ఉరవకొండ, రాయదుర్గం ప్రాంతాల్లో ఎడారీకరణతో ఇసుక మేటలు వేయడంతో ఎండతీవ్రత అధికంగా ఉంటోంది.ఈ నెలలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. కనిష్టంగా 26 డిగ్రీలు నమోదవుతోంది. ఎండలకు పది రోజుల్లో 10 మందికి పైగా వడదెబ్బ బారిన పడి మృత్యువాత పడ్డారు. సోమవారం సైతం ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరింది. జిల్లాలోని శింగనమల, పామిడి, తాడిమర్రి, ఉరవకొండ, గుంతకల్లు, ధర్మవరం, రాయదుర్గం, అనంతపురం, గుత్తి, బుక్కరాయసముద్రం, గార్లదినె్న, నార్పల, పుట్లూరు, యల్లనూరు, పుట్టపర్తి, విడపనకల్లు, కంబదూరు, తాడిమర్రి, పెనుకొండలో కనిష్టంగా 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదువుతోంది. గత ఏడాది ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు ఇంతగా లేవు. ఒక్క నిమిషం విద్యుత్ కోత పడినా భరించలేని పరిస్థితి తలెత్తింది. గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత కోతలు మొదలయ్యాయి.వృద్ధులు, చంటిపిల్లలు, బాలింతలు, వ్యాధిగ్రస్తులు ఉక్కపోతకు తట్టుకోలేక పోతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల జ్వరాల బారిన పడుతున్నారు.