విశాఖపట్టణం, ఏప్రిల్ 21,
విశాఖ జిల్లా. మొదటి నుంచీ జగన్ రాజకీయం వైజాగ్ చుట్టూనే తిరుగుతోంది. విశాఖను ఏకంగా ఎగ్జిక్యూటివ్ కేపిటలే చేయాలనుకున్నారు. గతంలో తల్లి విజయమ్మను సైతం విశాఖ నుంచే పోటీ చేయించి.. ఓడిపోయి పరువంతా పోగొట్టుకున్నారు. ఆ తర్వాత విజయసాయిని వైజాగ్‌కు ఫిక్స్ చేసి.. ఆ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన మాత్రం అవినీతి, కబ్జాలు, అరాచకాలతో విశాఖను ఆగమాగం చేశారు. పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేశారు. అలా, సాయిరెడ్డి చేతిలో చితికిపోయిన విశాఖలో వైసీపీని మళ్లీ పూర్వవైభవం దిశగా నడిపించే కీలక బాధ్యతలను కొత్త మంత్రి విడదల రజనీకి అప్పగించడం ఆసక్తికరంగా మారింది. ఎంతోమంది సీనియర్లు ఉండగా.. విశాఖ జిల్లా వైసీపీని రజనీ చేతిలో పెట్టడం వెనుక జగన్ వ్యూహం ఏమై ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. రజనీ. జస్ట్ ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే. పెద్దగా రాజకీయ అనుభవం కూడా లేదు. అలాంటి రజనీని.. ఎక్కడో చిలకలూరిపేట నుంచి తీసుకొచ్చి.. విశాఖ పగ్గాలు అప్పగించడం వెనుక జగన్ లెక్క వేరే ఉందని అంటున్నారు. ఆమె తొలిసారి ఎమ్మెల్యేనే అయినా.. మంత్రి పదవి వరకూ ఈజీగా ఎదగడం చూస్తుంటే రజనీ.. జబర్దస్త్ లీడర్ అని తెలిసిపోతోందిగా. చంద్రబాబును నాటిన మొక్క నంటూ రాజకీయాల్లోకి వచ్చి.. టీడీపీకి హ్యాండిచ్చి.. వైసీపీలోకి దూకి.. మర్రి రాజశేఖర్‌కు చెక్‌పెట్టి.. ఎమ్మెల్యేగా గెలిచి.. మూడేళ్లలోనే మంత్రి పదవి దక్కించుకోవడం మామూలు విషయమేమీ కాదు. ఆమె రాజకీయ చాతుర్యానికి మెచ్చే జగనన్న.. విశాఖ జిల్లాను విడదల చేతిలో పెట్టారని అంటున్నారు. సోషల్ మీడియాను మేనేజ్ చేయడంలో రజనీ ఎక్స్‌పర్ట్. ఆకట్టుకునే కట్టు, బొట్టుతో.. ఆకర్షించే ప్రసంగాలతో.. ప్రజల అటెన్షన్ తనవైపే ఉండేలా చేయడం బాగా వంటబట్టించుకున్నారని చెబుతారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు, ప్రసంగాలు, కార్యక్రమాలు అప్‌డేట్ చేస్తూ.. ప్రత్యేకంగా ప్రమోషన్ టీమ్‌ను పెట్టుకొని.. తనేదో హంగామా చేస్తున్నట్టు సీన్ క్రియేట్ చేస్తూ.. నిత్యం న్యూస్‌లో ఉంటూ.. ప్రజల నోళ్లలో తన పేరు వినిపించేలా.. తన గురించి చర్చ జరిగేలా చేస్తుంటారని అంటారు. ఈ రోజుల్లో ఇలాంటి మీడియా ప్రమోషనే కదా కావాల్సింది. ఆ టాక్‌టిస్ విశాఖ జిల్లాలో బాగా వర్కవుట్ అవుతుందనేది జగన్ అంచనా. విశాఖ నగరంలో యువత, చదువుకున్నవారు, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువ. అర్బన్ కల్చర్ పీపుల్ విడదల రజనీ వంటి వారు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అలా, విశాఖలో రజనీ మేనియాని ఓట్ల రూపంలో మార్చుకోవడం సులువు. అందుకే, పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా.. వారందరినీ కాదని విడదల రజనీని విశాఖ జిల్లా వైసీపీ ఇంఛార్జిగా నియమించారని అంటున్నారు.