గుంటూరు, ఏప్రిల్ 21,
కొత్త రీజనల్ కో ఆర్డినేటర్లు వచ్చినంతనే వైసీపీలో పాత విభేదాలు అంత సులువుగా తొలగిపోవు కానీ కొన్నింటికి పరిష్కారం దొరుకుతుంది అన్న ఆశతో ఉన్నారు అక్కడి నాయకులు. ఇక్కడ నెలకొన్న పరిణామాలను చక్కదిద్దే బాధ్యతలు వైసీపీ పెద్దలు అందుకుంటే చాలు తరువాత పార్టీ మరింత బలోపేతం కావడం సాధ్యమేనన్న భావనతో కొందరు ఉన్నారు. పార్టీని మరోవైపు ప్రభుత్వాన్ని ఏక కాలంలో సంస్కరించిన జగన్ కు పల్నాడు సమస్యలు కొన్ని కొత్త తలనొప్పులే తీసుకురానున్నాయి. వాటిపై ఆయన దృష్టి నిలపకపోతే సౌమ్యతకు నెలవు అయిన ఆ ఎంపీ పార్టీని వీడి తన దారి తాను చూసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఆ వివరం ఈ కథనంలో….పల్నాటి సీమలో విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడి వైసీపీలో అంతర్యుద్ధమే కొనసాగుతుంది అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. ముఖ్యంగా నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు అన్న వాదన కూడా వినవస్తోంది. గత కొంత కాలంగా ఆయనకు, మిగతా ఎమ్మెల్యేలకూ మధ్య దూరం బాగానే పెరిగిందని తెలుస్తోంది.ఈ కారణంగా ఆయన పార్టీ మారనున్నారు అన్న సంకేతాలు కూడా వస్తున్నాయి.ముఖ్యంగా జిల్లాల ఏర్పాటు విషయమై కూడా ఆయన అసంతృప్తితోనే ఉన్నారని తెలుస్తోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను అనౌన్స్ చేసినప్పటికీ సంబంధిత ప్రతిపాదనలు ఏవీ బాగాలేవని ఎంపీ అంటున్నారు. దీంతో పాటు పార్టీ అధిష్టానంకు ఏం చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు అని కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు.గతంలో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తగాదాతో పార్టీ పరువు చాలానే పోయింది. ఓ రైతును చెప్పు కొట్టేందుకు వెళ్లారన్న అభియోగం తరువాత అదే రైతును అరెస్టు చేయించడం ఇవన్నీ కూడా ఆయనకు నచ్చలేదు అని కూడా తేలిపోయింది. దీంతో ఆయన పార్టీ కి గుడ్ బై చెబితే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కి ఆయనకూ మధ్య విభేదాలు ఉన్నాయని కూడా సమాచారం. ఇవన్నీ ఓ ఎత్తయితే అధికారంలో ఉండి కూడా తన ఆఫీసు ముందరి రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నా కూడా భరించాల్సి వస్తుందని, కొత్త రోడ్డు వేయించుకునేందుకు కూడా వీలుగా లేదని, ఏమంటే అధికారులు నిధులు లేవనే అంటున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఒక్కటి కాదు రెండు చాలా పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారు అన్న వార్తలు గుప్పు మంటున్నాయి. నిప్పు లేనిదే పొగరాదు.. ఒప్పుకోవాలి.,. ఎవరు ఈ జ్వాలను రగిలించారు.. ఎవరు దీనికి బలి కానున్నారు అన్నది ఇప్పుడొక హాట్ టాపిక్ .