చెన్నై, ఏప్రిల్ 21,
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు మళ్లీ కష్టాలు వచ్చాయి. కొడనాడు ఎస్టేట్ మర్డర్ -దోపిడీ కేసులో శశికళను విచారించబోతున్నారు తమిళనాడు పోలీసులు. చెన్నైలో విచారణకు హాజరుకావాలని శశికళకు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 23,2017లో నీలగిరి జిల్లాలో ఉన్న కొడనాడు ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డును హత్య చేసి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ కేసులో శశికళను ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించడం సంచలనం రేపుతోంది. తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలితకు కొడనాడు ఎస్టేట్‌తో ఎంతో అనుబంధం ఉంది. జయలలిత మరణం తరువాత కొడనాడు ఎస్టేట్ వ్యవహారాలను శశికళ పర్యవేక్షించారు. అయితే జయలలిత మాజీ కారు డ్రైవర్ కనగరాజుతో పాటు మరో 11 మంది ఎస్టేట్‌లో చొరబడి సెక్యూరిటీ గార్డులను బంధించారు. ఓంబహదూర్ అనే సెక్యూరిటీ గార్డు ఈ దాడిలో చనిపోయాడు. జయలలితకు చెందిన 200 కోట్ల రూపాయల నగదు ఎస్టేట్ నుంచి లూటీ అయినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం 42 వేల విలువైన వాచ్‌లు మాత్రమే చోరీకి గురి అయినట్టు తెలిపారు. దోపిడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కనగరాజ్ అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తరువాత ఎస్టేట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దినేశ్‌కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చాక కొడనాడు ఎస్టేట్ కేసు విచారణను మళ్లీ ప్రారంభించారు. కేసులో నిందితులుగా ఉన్న దీపు, సంతోష్, సంతోషన్ హైకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా శశికళను పోలీసులు విచారించబోతున్నారు. అయితే మాజీ సీఎం పళనిస్వామిని టార్గెట్ చేసేందుకే కొడనాడు కేసును డీఎంకే ప్రభుత్వం మళ్లీ తవ్వుతోందని అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.