న్యూఢిల్లీ, ఏప్రిల్ 21,
బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు విమానాశ్రయ సిబ్బంది, కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినిమాల్లో చూపించే విధంగానే బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పొట్టలో, మలమూత్ర విసర్జన చేసే ప్రదేశాల్లో గోల్డ్‌ను పెట్టుకుని వచ్చి అడ్డంగా దొరికిపోతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. రానురాను నిందితులు వేస్తున్న ఐడియాలు చూసి తనిఖీ అధికారులు షాక్ అవుతున్నారు. తాజాగా ఢిల్లీ లోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బట్టతలను కవర్ చేస్తూ పెట్టుకున్న విగ్‌లో బంగారం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని విమానాశ్రయ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.అబుదాబి నుంచి వచ్చిన సదరు ప్రయాణికుడిని చూసి ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే కస్టమ్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. అదే సమయంలో సదరు వ్యక్తి తడబడుతూ మాట్లాడడంతో అనుమానం మరింత ఎక్కువైంది. తనిఖీల్లో భాగంగా ప్రయాణికుడు పెట్టుకున్న విగ్ తీసి చూస్తే పేస్టు రూపంలో ఉన్న బంగారం బయటపడింది. దాదాపు 630.45 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.30.55 లక్షలు ఉంటుందని, నిందితున్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారుల తెలిపారు.