రోహిణీ కార్తె దగ్గర పడుతున్న కొద్దీ ఎండలు ముదురుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు జిల్లాను అగ్నిగుండంగా మారుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు జిల్లా వాసులను హడలెత్తిస్తున్నాయి. జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో 40 నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం విశేషం. నిప్పులు కురిపిస్తున్న సూరీడి ధాటికి జిల్లా వాసులు తాళలేకపోతున్నారు. మండె ఎండలకు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితికి కనిపించడం లేదు. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు భీతిల్లుతున్నారు. వృద్ధులు, చిన్నారులను వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో 48డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మంగళవారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా విజయవాడ, నందిగామలో 46 డిగ్రీలు చొప్పున నమోదవ్వగా గుడివాడ, నూజివీడులలో 44 డిగ్రీలు చొప్పున నమోదైంది. ఉదయం 6గంటల నుండే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాత్రి 10గంటలు దాటినా వడగాడ్పులు ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో సముద్ర తీర ప్రాంతాల్లో సాయంత్రం పూట గాడ్పులు తగ్గి చల్లగాలి వీచేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. సముద్రానికి అనుకున్న గ్రామాల్లో సైతం వడగాడ్పులు ఏ మాత్రం తగ్గడం లేదు.