YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

భూగోళం పరిరక్షణే..మానవాళి బృహత్తర లక్ష్యం.... డాక్టర్ భారత రవీందర్ (సైకాలజిస్ట్ )

భూగోళం పరిరక్షణే..మానవాళి బృహత్తర లక్ష్యం....   డాక్టర్  భారత రవీందర్ (సైకాలజిస్ట్ )

( నేడు వరల్డ్ ఎర్త్ డే  జరుపుకుంటున్న సందర్భంగా )
అస్తిత్వానికి ఆధారం. సమస్త జీవరాశుల భారం మోసేది ధరణీతలమే . విశ్వంలో మానవజాతి లాంటి జీవులు ఉన్న ఏకైక గ్రహం కూడా ఈ భూగోళమే .  భూమి ఏర్పడి సుమారు 460 కోట్ల సంవత్సరాలైంది . భూమిపై తొలి జీవం ఉద్భవించి 350 కోట్ల సంవత్సరాలు కావొస్తున్నది . పరిణామక్రమంలో  రెండు కాళ్లపై నిలబడే మానవుడు ఉద్భవించి కేవలం 44 లక్షల ఏండ్లు అయ్యింది . ఈ విశ్వంలో గ్రహాంతర జీవుల ( ఏలియన్స్ ) ఉనికి కోసం పరిశోధనలు ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి  . కానీ ఇప్పటి వరకు ఆధారాలు లభించలేదు . అనేక సంపన్న దేశాలు సూర్య కుటుంబానికి ఆవల భూమి లాంటి మరో భూమిని  ( సెకండ్ ఎర్త్ ) కనుగొనటానికి కూడా  ప్రయత్నాలు చేస్తున్నారు . భూమి పుట్టుక గూర్చి అతి ప్రాచీన కాలం నుండి అనేక భావనలు ప్రచారంలో ఉన్నవి . పృథ్వీ ,ధరణి , పుడమి , ధరిత్రి అనే పలు పేర్లతో పిలువబడే భూమి ,   ధర్మం ( సార్వత్రిక ప్రయోజనం ) అనే భావనతో అన్యోన్యాశ్రిత సంబంధంను  కలిగి  ఉంది . ఈ ఉద్దేశ్యంతోనే భారతీయులు భూమిని ‘ భూమాత ‘ ( మదర్ ఎర్త్ ) అని అన్నారు . ప్రపంచంలో  వేదాలు అతి  ప్రాచీనమైనవి . “ భూమి దేవనిర్మిత నౌక అని , మహాజలంపై స్థిరంగా తెలియాడుచున్నది “ అని యజుర్వేదం చెబుతోంది . ప్రముఖ ప్రాచీన భారతీయ గణిత మరియు  ఖగోళ శాస్త్రవేత్త అయిన  ఆర్యభట్టు ( కీ.శ.476-550 ) తన  ‘ ఆర్యభట్టీయం ‘ అనే  గ్రంధంలో “ భూగోళ : సర్వత్ వృత్త : “అనగా భూమి వృత్తాకారంగా , అన్నీ వైపులా వ్యాపించి ఉందని చెప్పాడు .  వరాహమిహీరుడు అనే మరో ప్రాచీన  భారతీయ ఖగోళ  శాస్త్రజ్ఞుడు ( కీ.శ. 505-587 ) తన  “ పంచసిద్దాంతిక “ అనే  గ్రంధంలో భూమి గూర్చి ... “ పంచ భూతాలతో నిర్మితమై గుండ్రని భూమి పంజరంలో వేలాడే ఇనుపబంతి లాగా ఖగోళంలో తారల మద్య నిలిచి ఉన్నది “ అని వ్యాఖ్యానించాడు . కానీ భూమి ఒక గ్రహమని , సూర్యకుటుంబంలో ఒక భాగమని , బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం భారీ విస్పోటనంతో బద్ధలై సూర్యుని నుండి విడివడిన ఒక ముక్క,  భూమి అని ఆధునిక సైన్సు చెబుతోంది . సుదీర్ఘ వయస్సు గల భూమిపై మానవుల ఆధిపత్యం  ( ఆంత్రపోసెంట్రిజం )  పెరుగుతున్నకొలది భూమిపై ఎన్నో రకాల  మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మానవుడు తన స్వార్థప్రయోజనాల కోసం ప్రకృతి వనరుల విధ్వంసానికి, గ్రీన్ హౌస్ వాయువుల ఉద్ఘారాల పెరుగుదలకు కారణమవుతున్నాడు . ఇటువంటి చర్యలతో  భూగోళం వేడెక్కడం , తద్వారా కలిగే భూతాపం  ( గ్లోబల్ వార్మింగ్ )వంటి  విపరీత పరిణామాలు  చోటుచేసుకుంటున్నాయి . దీంతో భూగోళంపై మానవుని మనుగడకే ప్రమాదం ముంచుకొస్తున్నది . కనుక భూమికి , ప్రకృతికి కలుగుతున్న విధ్వంసాన్ని నిలువరించి , పుడమిని పరిరక్షించాలనే బృహత్తర లక్ష్యంతో ప్రతి యేటా ఏప్రిల్ 22 న ప్రపంచ ధరిత్రి దినోత్సవం ( వరల్డ్ ఎర్త్ డే )ను జరుపుతున్నాము . అమెరికన్  సెనేటర్ మరియు పర్యావరణవేత్త గెలార్డ్ నెల్సన్ ( 1960 ) ఆలోచనల స్ఫూర్తి తో , జాన్ మెక్ నెల్ చొరవతో , 1969 డిసెంబర్ నెలలో  ఐక్యరాజ్యసమితి ( యూ యన్ ఓ ) ఆద్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపాలని  నిర్ణయించనైనది . అందుకనుగుణంగా  1970 ఏప్రిల్ 22 న మొట్టమొదటి ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరిగింది . నేడు 2022 ఏప్రిల్ 22 న ' మన గ్రహంపై పెట్టుబడి ' ( ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ ) అనే ఇతివృత్తంతో  53 వ భూమి దినోత్సవంను  జరుపుకోవాలని యూయన్ఓ నిర్ణయించింది . 174 దేశాలకు పైగా ఈ పుడమి పండుగ ( ఎర్త్ ఫెస్టివల్ ) ను జరుపుకుంటున్నాయి . ఇందులో భూతాపం , ప్రకృతి పరిరక్షణ , వాతావరణ మార్పు ల గూర్చి ప్రజలకు , విద్యార్థులకు  అవగాహన కలిగేలా పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించబడింది .
భూతాపం – మనవాళికి పెనుశాపం
భూగోళంపై సుమారు 71% నీరు , 29% భూభాగం ఉంది . ఇప్పుడు భూగ్రహం అనేక సమస్యలను , సవాళ్లను ఎదుర్కొనుచున్నది . మానవాళి మతిమాలిన  , ప్రకృతి విరుద్ధమైన  చర్యల వల్ల భూమండలంపై గ్రీన్ హౌజ్ వాయువుల ఉధ్ఘారాలు రోజురోజుకూ పెరుగడం , తద్వారా  కలిగే  భూతాపం మనవాళికి పెను శాపంగా మారుతోంది . ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వనరుల విధ్వంసం , పర్యావరణ కాలుష్యం , ప్రకృతిలో అకస్మాత్తుగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు , అడవుల నరికివేత , సముద్రజలాల ఆమ్లత్వం , గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్ఘారాల పెరుగుదల , ఎయిరోసాల్స్ , ఓజోన్ పొర క్షీణత , అణుయుద్ధాలు , బయోవార్స్ , రేడియేషన్ కాలుష్యం , న్యూక్లియర్ వ్యర్థాలు , మితిమీరిన సాంకేతికత  ,  కెమికల్ ఫర్టిలైజర్స్ , పెస్టిసైడ్స్ వాడకం మొదలగు అంశాలు మానవుని  ఆందోళనకు కారణమవుతున్నాయి .పెరుగుతున్న జనాభా అవసరాలు  తీరే విధంగా , భూతాపాన్ని ఎలా తగ్గించాలి ! భూగోళ సుస్థిరతను ఎలా కాపాడుకోవాలి !  అనేవి  మన ముందున్న ప్రధాన సవాళ్ళు .  2017 వ సంవత్సరంలో 184 దేశాలకు చెందిన సుమారు 1500 మంది శాస్త్రవేత్తల బృందం సమావేశమై “ సెకండ్ నోటీస్ “ పేరున భూమి ప్రమాదపు కోరల్లో చిక్కుకుందని రెండవ హెచ్చరిక ( సెకండ్ గ్లోబల్ వార్నింగ్ ) జారీచేసిన విషయం గమనించాలి . భూతాప నియంత్రణ పై  బ్రెజిల్లోని రియోడిజనీరో సదస్సు ( 1992 ) మొదలు పారిస్ ఒప్పందం మరియు ఇటీవల జరిగిన  గ్లాస్గోసదస్సు-2021 ( కాప్-26 ) వరకు ,  పారిశ్రామిక విప్లవం నాటి కంటే ముందు పరిస్థితులతో పొలుస్తూ భూఉష్ణోగ్రత పెరుగుదలను 2030 నాటికి  20c ల వరకు పరిమితం చేయాలని ప్రపంచ దేశాలన్నీ నిర్ణయించాయి . కానీ అధిక కర్భన ఉద్ఘారిత దేశాలు పారిస్ ఒప్పందం అమలులో ఆసక్తి కనబరుచుట లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2030-2052 సంవత్సరాల మద్య 1.50c ల భూఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని , ఆ తర్వాత 10-15 ఏండ్లలో ఉష్ణోగ్రత 20c కంటే ఎక్కువగా పెరుగుతుందని , దీన్ని అరికట్టాలంటే 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కర్భన  ఉద్ఘారాలను సగానికి పైగా  తగ్గించాలని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వారి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అవుట్ లుక్ రిపోర్ట్ – 2019 పేర్కొంది . “  ఈ పరిస్థితిని తక్షణం అడ్డుకోకపోతే భూమి ఉష్ణోగ్రత గత మూడు లక్షల  సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోతుంది , అప్పుడు తలెత్తే విపత్తులు మాటల్లో చెప్పలేము “ అని సూత్రీకరించిన అమెరికన్ శాస్త్రవేత్త నోర్డ్ హాస్ మాటలు నిజం కాక మానవు  . ఒకవేళ ఇప్పుడున్న భూ ఉష్ణోగ్రత 20c  కంటే ఎక్కువగా పెరిగితే … దృవ ప్రాంతాల్లో మంచు ఫలకాలు కరుగుతాయి . సముద్రాలు పోటెత్తుతాయి . సముద్రతీర నగరాలు , చిన్న, చిన్న దీవులు నీట మునుగుతాయి . ఋతువులు గతి తప్పుతాయి . మండుటెండల్లో కుండపోత వర్షాలు కురుస్తాయి . వర్షాకాలంలో ఎండలు భగ్గుమంటాయి . ఆకాల వర్షాల వల్ల  , వరదలు , పంట నష్ఠం,జంతువుల వలసల్లో మార్పులు కనిపిస్తాయి . వడగాడ్పులు , కరువుకాటకాలు ఏర్పడుతాయి . నోబెల్ శాంతి బహుమతి- 2007  గ్రహీత అల్గోర్ మాటలను ఈ సందర్భంగా మననం  చేసుకోవాలి ... “ భూమికి జ్వరం వచ్చింది . దీనికి కారణం కార్బన్ డై ఆక్సైడ్ , దీన్ని తగ్గించే భాద్యత మనందరిపై ఉంది .ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రకృతి సమతుల్యత , జీవ వైవిధ్యం ప్రమాదంలో  పడి , చివరికి మానవజాతి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది “ .  భూవాతావరణ పరిస్థితులు మానవాళి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఈ  తరుణంలో అవగాహనా పరిష్కార మార్గాలు కనబరచకపోతే ముందు తరాలు మనల్ని క్షమించవు .
భూగోళం పరిరక్షణ – పరిష్కార మార్గాలు
మానవ జీవనవికాసాన్ని , భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వనరుల పరిమిత వినిమయంతో , ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశలో ప్రజలు మరియు ప్రభుత్వాలు చిత్తశుద్దితో   ఆలోచనలు చేయాలి . ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం తీర్మానాలను   ప్రపంచ దేశాలు ఖచ్చితంగా పాటించాలి  . ప్రభుత్వాల  పరంగా భూపరిరక్షణ , పర్యావరణ  చట్టాలను కఠినతరం చేయాలి .  ప్రకృతి వనరుల శోషణ కాకుండా , ఆ వనరుల పోషణ , సంరక్షణలే పరమావధిగా కృషి జరుగాలి . భూగోళంపై ప్రకృతి వనరుల పరిరక్షణ , వాతావరణ మార్పులపై అవగాహన పెంచడంతో పాటు , ఉత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తరించడం , సుస్థిర సేద్యవిధానాలకు పెద్దపీట వేయడం , ఆటవీపరిరక్షణ  ప్రాధాన్యాంశాలుగా గుర్తించి , అందుకనుగుణంగా తగు చర్యలు తీసుకోవడం వల్ల పుడమిని భూతాపం నుండి స్వాంతనం కలిగించ వచ్చును . ప్రజలు సాద్యమైనంత వరకు రీసైక్లింగ్ కు అవకాశం ఉండే వస్తువులనే వాడాలి . పర్యావరణ సానుకూల ఉత్పత్తులనే ఉపయోగించాలి .  డిస్పోజ బుల్ ప్యాకేజీలకు దూరంగా ఉండాలి . హరితహారం స్ఫూర్తితో  దేశవ్యాప్తంగా  ‘ గ్రీన్ హ్యాండ్స్  ‘ పేరుతో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాల నిర్వహణకు నడుం బిగించాలి . పర్యావరణ రక్షణకు  పున:వాడకం ( Re-use ) ,పున:చక్రియం ( Re- cycle ) , పునరుద్ధరణ ( Re-store ) , తగ్గింపు ( Reduce ) మరియు  పున:అభివృద్ధి ( Replenish ) అను  5Rs ఫార్ములాను పాటించాలి .  ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 న  భూతాపం , పర్యావరణ పరిరక్షణ , అడవుల నరికివేత , జీవరాశుల కనుమరుగు , కాలుష్యం , ఓజోన్ పొర క్షీణత వంటి  అంశాల  గూర్చి కేంద్ర , రాష్ట్ర  ప్రభుత్వాల మార్గదర్శనంలో స్థానిక సంస్థలు , స్వచ్చంద సంస్థలు సమిష్ఠిగా ప్రజలను వాతావరణ అక్షరాస్యులు( క్లైమేట్ లిటరేట్స్ )గా,పర్యావరణ సంరక్షకులుగా    చైతన్యవంతులను  చేయుటకు   అవగాహనా సదస్సులు , ఊరేగింపులు ,భూవారోత్సవాలు ,  కరపత్రాల పంపిణీ , వనమహోత్సవం లాంటి  పర్యావరణ కార్యక్రమాలు నిర్వహించాలి . పాఠశాలలలో , కళాశాలలలో విద్యార్థులకు  క్విజ్ , వ్యాసరచన , ఉపన్యాస పోటీలు , నిపుణులచే సెమీనార్లు , కాన్ఫరెన్సులు  నిర్వహించి విద్యార్థులను  పర్యావరణ ఉద్యమ సైనికులుగా తయారు చేయాలి . ఆరోగ్యకరమైన భూమి –ఆరోగ్యవంతులైన ప్రజలు ( హెల్ధి ప్లానెట్ –హెల్దీ పీపుల్ ) అనే నినాదంతో  ప్రభుత్వాలు , ప్రజలు పనిచేయాలి .  ప్రకృతిలో భాగమైన మానవుడు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కొంటున్నాడు . తన నష్టాన్ని తానే కొనితెచ్చుకుంటున్న  ‘ భస్మాసుర ప్రవుత్తి ‘ ని ఇప్పటికైనా  విడనాడాలన్నదే ప్రకృతి మనకు చెబుతున్న పాఠంగా అర్థం చేసుకోవాలి .                        

Related Posts