అనంతపురం, ఏప్రిల్ 22,
మంత్రి పదవి చేతి దాక వచ్చి.. అందకుండా పోయింది. కానీ పార్టీ అధిష్టానం వారిని శాంతింపజేయాలనో లేక.. వారు సమర్థులనో తెలియదు కానీ.. వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. రెండు జిల్లాలకు వేర్వేరుగా అధ్యక్షులైన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తారా? వారికి జిల్లా నేతలు సహకరిస్తారా? వారి బలం ఏంటి? లోపాలు ఏంటి? ఇన్ ఛార్జి మంత్రుల ప్రభావం ఆ జిల్లాపై ఎంత వరకు ఉండబోతోంది? మారిన అనంత వైసీపీ రాజకీయలపై ప్రత్యేక కథనం..తినేందుకు భోజనం లేదంటే.. గంజి నీళ్లతో సరిపెట్టోమంటారు.. కానీ రాజకీయాల్లో అలాంటి కుదరవు.. తమకు దక్కాల్సిన పదవులు దక్కకపోతే రాజీ పడేదిలేదంటారు నేతలు. ప్రస్తుతం వైసీపీలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. నిన్నటి వరకు మంత్రి పదవి వస్తుందని.. ఉన్న మంత్రి పదవి ఫదిలంగా ఉంటుందని ఆశించిన ఆ నేతలకు మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణతో షాక్ తగిలింది. అయితే మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తికి విరుగుడుగా.. పార్టీ బాధ్యతలు ఇస్తామని సీఎం జగన్ ముందే చెప్పారు. ఈనేపథ్యంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా అన్ని చోట్లా అధ్యక్షులను నియమించారు. మంత్రి బాధ్యతలు అధికారికంగా మాత్రమే ఉంటాయని.. పార్టీ బాధ్యతలే చాల కీలకమని.. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతతో పాటు ఎవరి పని తీరు ఏంటో తెలిపే కీలకమైన పగ్గాలను మీచేతుల్లోకి అందిస్తున్నామని అధిష్టానం స్పష్టంగా తెలియజేసింది. అయితే ఈ నిర్ణయాలు పార్టీకి మంచి చేస్తాయా లేక మొదటికే మోసం చేస్తాయా అంటే.. ఉమ్మడి అనంతపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మంచే చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.దీనికి కారణం ఆయన ఎంచుకున్న అధ్యక్షులే. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా కాపు రామచంద్రారెడ్డిని, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి శంకరనారాయణను నియమించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధిక సీట్లను గెలిపించే బాధ్యతను తీసుకోబోతున్నారు. అయితే చాలా జిల్లాల్లో అధ్యక్షులతో విబేధాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏవి కనిపించవనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరు నేతలు అజాత శత్రువులనే చెప్పాలి. కాపు రామచంద్రారెడ్డి విషయానికొస్తే.. ఆయన వైఎస్ కుటుంబానికి మొదటి నుంచి విధేయులు. సీఎం జగన్ పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఎమ్మెల్యే పదవి త్యజించి వచ్చారు. అయితే మంత్రి పదవి రాలేదని రెండు సార్లు నిరాశలో ఉన్నారు. కానీ ఎక్కడా ఆయన పార్టీ గురించి కానీ, జగన్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తన జిల్లా పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఆయన్ను వ్యతిరేకించే వారు లేరు. అందరు ఎమ్మెల్యేలతోనూ సఖ్యతగా ఉంటారు. కాకపోతే కాపులకు ఏదైనా సమస్య వస్తే.. కొత్తగా వచ్చిన మంత్రి ఉషాశ్రీ చరణ్ నుంచే రావాలి. ఒక వైపు ఆమె మంత్రి.. ఇటు వైపు ఆయన అధ్యక్షులు ఈ రెండింటినీ ఇద్దరూ అర్థం చేసుకుంటే.. అనంతపురం జిల్లా వరకు పార్టీలో ఎలాంటి విబేధాలు కనిపించే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇక శంకర్ నారాయణ విషయానికొస్తే.. ఆయనకు తొలిసారే పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. రెండవ సారి ఇస్తారని ఆశించినా అది దక్కలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లా అయిన శ్రీ సత్యసాయి జిల్లా బాధ్యతలు అప్పజెప్పారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే.. శంకర్ నారాయణ మొదటి నుంచి సౌమ్యుడు జిల్లాలో ఏ ఒక్కరితోనూ విబేధాలు లేవు. గత కొన్నేళ్లుగా ఆయనే ఉమ్మడి జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎక్కడా చిన్న కంప్లైంట్ లేదు. ఈనేపథ్యంలో ఇక్కడ కూడా పెద్దగా సమస్యలు వచ్చే అవకాశం లేదు. ఇకపోతే.. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రుల విషయానికొస్తే.. రాష్ట్ర విద్యుత్తు, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా, రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను శ్రీసత్యసాయి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించారు. ఈ పదవులు మాత్రం కత్తి మీద సామేనని చెప్పాలి. అనంతలో ఎక్కడా విబేధాలు రావు కానీ నీటి పంపకాల విషయానికొస్తే మాత్రం ఆస్తి వివాదాలున్నంత ఫైటింగ్ కనిపిస్తుంది. అందునా ఇప్పుడు జిల్లాల విభజన జరిగింది. మరి దీనిని ఎలా పరిష్కరిస్తారన్నది చూడాలి.మరోవైపు చిత్తూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, అనంతపురం జిల్లాల సమన్వయకర్తగా, రీజినల్ కో ఆర్డినేటర్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. ఇక్కడ ఏ సమస్య ఉండదనే చెప్పాలి. మంత్రి పెద్దిరెడ్డిని రెండు జిల్లాల నేతలు ఎంతో గౌరవిస్తారు. మొత్తం మీద సీఎం జగన్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం అనంతపురం జిల్లాపై పాజిటీవ్ వైబ్రేషన్సే కనిపిస్తున్నాయి.