విజయవాడ, ఏప్రిల్ 22,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో,,ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డికి ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. జగన్ రెడ్డి రాజకీయ, వ్యాపార వ్యవహారాలన్నింటిలో విజయ సాయి, నెంబర్ 2గా ఉంటూనే ఉన్నారు.చివరకు అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి జైలుకు వెళితే,ఆయన వెంట విజయసాయి కూడా జైలుకు వెళ్ళారు. మొత్తం 16 నెలలు ఆయనతో జైలులోనే ఉన్నారు. ఇక వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత, అంతకు ముందు కూడా ఢిల్లీలో జగన్ రెడ్డి పనులను విజయసాయి చక్క పెడుతూ వచ్చారు. అలాగే,రాజ్యసభ ఎంపీగా, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ప్రభుత్వ కార్యకలాపాలను, కేంద్ర రాష్ట్ర సంబంధాలను కూడా ఆయనే నెత్తికెత్తుకున్నారు..మరో వంక ఉత్తరాంధ్ర వైసేపీ ఇంచార్జిగా, ఆమూడు జిల్లాలకు ఆయనే ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరించారు. అయితే రాజకీయాలలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయి అన్నట్లుగా, ఇప్పుడు సీన్ రివర్స్ అయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకనో గానీ, విజయసాయి రెడ్డిని పదవుల నుంచి పక్కకు తప్పిస్తున్నారు. ఒకప్పుడు, ప్రస్తుతం సజ్జల నిర్వహిస్తున్న,‘ఆల్ ఇన్ వన్’ పోజిషన్’లో విజయసాయి ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత, సజ్జల ఎంట్రీతో జగన్ రెడ్డి, సాయి రెడ్డి మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు చివరకు విజయసాయి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారిందంటున్నారు.ఇటీవల జగన్ రెడ్డి చేపట్టిన పార్టీ పక్షాళన కార్యక్రమలో భాగంగా ఉత్తరాంధ్ర ఇంచార్జి (సమన్వయకర్త) బాధ్యతల నుంచి విజయ సాయి రెడ్డినితప్పించారు. వైవీ సుబ్బారెడ్డికి విశాఖ పార్టీ బాధ్యతలు అప్పగించారు. అంతే కాదు, విజయ సాయికి, ఇంకో కీలక బాధ్యత అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. ఆయన పదవులు ఒక టొకటిగా, తీసేస్తున్నారు. ఒక విధంగా చూస్తే, జగన్ రెడ్డి ఎందుకనోగానీ,ఒకప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమ నెచ్చలి శశికళను దూరం పెట్టినట్లుగా జగన రెడ్డి విజయ సాయిని దూరం పెడుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొమ్మన కుండా పోగాబెడుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విజయసాయి పరిస్థితి ఇంత బతుకూ బతికి.. అన్నట్లుగా పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్’ పోస్టుకే పరిమితం అయిందని, పార్టీలో కొందరు అయ్యో .. అంటున్నారు. ఈ నేపధ్యంలో విజయసాయి రెడ్డికి మరోమారు రాజ్యసభ అవకాశం అయినా ఇస్తారా లేక అక్కడా మొండి చేయి చూపిస్తారా అనే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విజయ సాయి రాజ్యసభ పదవీ కాలం ముగింపు దశకు చేరుకుంది. ఆయనతో పాటుగా రాష్ట్రం నుంచి ఇద్దరు టీడీపీ, ఒక బీజేపీ, మొత్తం నలుగురు పెద్దల సభ సభ్యుల పదవీ కాలం త్వరలో ముగియనునుంది. మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.ఈసారి నాలుగు స్థానాలు కూడా వైసీపీ గెలుచుకునే అవకాశం వుంది. నిన్న మొన్నటిదాకా అందులో ఒకటి విజయ సాయి రెడ్డికి ఖాయమనే ప్రచారం జరిగింది. జగన్ రెడ్డి, విజయ సాయిని రీ నామినేట్ చేస్తారని భావించారు. అయితే తాజా పరిణామాల నేపధ్యంతో పాటుగా, తెరపైకొస్తున్న కొత్త సామాజిక సమీకరణల నేపధ్యంలో, విజయ సాయికి, పెద్దల సభలో కుర్చీ డౌటే అంటున్నారు. నిజానికి, విజయసాయి పక్కా అనే లెక్కతో, ఇంతవరకు పార్టీలో అందరూ మూడు ఖాళీల గురించే మాట్లడుతూ వచ్చారు. మూడు స్థానాల్లో ఒకటి మైనార్టీ..మరకొటి ప్రముఖ పారిశ్రామిక వేత్త సతీమణి..మరొకటి బీసీ లేదా ఎస్సీ కి కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా, సినిమా రంగం నుంచి ఒకరికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి- రాం చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా నిర్మాత, న్యాయవాది నిరంజన్ రెడ్డి పేరు తెర మీదకు వచ్చింది.దీంతో.. విజయ సాయిరెడ్డికి మరో షాక్ తప్పదా అనే చర్చ మొదలైంది. కాగా, బీసీ వర్గం నుంచి బీదా మస్తాన రావుపేరు ప్రముఖంగా వినిపిస్తోంది.అలాగే, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదానీ కుటుంబ సభ్యులకు ఒక సీటు ఖాయమని అంటునారు. అయితే, ఏది ఏమైనా, విజయ సాయిరెడ్డిని పక్కన పెట్టరని, ఢిల్లీలో ఉన్న అవసరాల దృష్ట్యా ఆయనకు మళ్ళీ అవకాశం ఇస్తారని పార్టీ నేతలు కొందరు ఇంకా నమ్ముతున్నారు. అయితే, సజ్జల వర్గం మాత్రం, నో వే, విజయసాయి మళ్ళీ పైకి లేచే ఛాన్స్ లేదని, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నదే తమ ఆలోచనగా చెపుతున్నారు. అయితే, చివరకు జగన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందో ... అనే మాట అయితే ఇటు సాయి రెడ్డి వర్గంలో, అటు సజ్జల వర్గంలో వినిపిస్తోంది.