కాకినాడ, ఏప్రిల్ 22
గత ఎన్నికల ముందు జగన్ ఏం చెప్పారో...అధికారంలోకి వచ్చిన తరువాత అందుకు పూర్తి విరుద్ధంగా చేస్తున్నారు. నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాజధాని అన్నారు. నేడు కోర్టులు మొట్టికాయలు వేసినా మూడు రాజధానులే ముద్దు అంటున్నారు. నాడు పాదయాత్రలో గ్రాసిమ్ రసాయనాల పరిశ్రమను విష పరిశ్రమ అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ పరిశ్రమ అమృత తుల్యమంటూ ప్రారంభోత్సవానికి హాజౌతున్నారు. నాడు తెలుగుదేశంప్రభుత్వం ఔనన్న ప్రతి దానినీ కాదనమే పనిగా పెట్టుకున్న జగన్ నేడు నాడు వేటినైనా కాదన్నారో వాటినే ఔదాలుస్తూ ముందుకు సాగుతున్నారు. మొత్తానికి జగన్మాయను ఓ రేంజ్ లో ప్రదర్శిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన గురువారం ప్రారంభోత్సవం చేయనున్న గ్రాసిమ్ కెమికల్ ఫ్యాక్టరీ ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందినది. తూర్పుగోదావరి జిల్లా భలభద్రపురంలో దాదాపు 900 కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ ఫ్యాక్టరీ గురువారం జగన్ చేతుల మీదుగా ప్రారంభం.రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి, పెట్టుబడులు రావడం లేదు అన్న ఆందోళన వ్యక్తమౌతున్న సమయంలో రూ.900 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ప్రారంభించడం ఎంతైనా ఆహ్వానించదగ్గది. కానీ నాలుగేళ్ల నాడు విపక్ష నేత హోదాలో ఇదే పరిశ్రమపై విషంకక్కి, ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాల బాట పట్టించిన జగన్ ఇప్పుడు అదే పరిశ్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో రావడమే వైచిత్రి. నాడు జగన్ పుణ్యమా అని జనం ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. కేసుల్లో ఇరుక్కున్నారు. అలా ఇరుక్కున్న వారు దాదాపు 500 మంది ఉన్నారు. ఇప్పటికీ వారిపై కేసులు నడుస్తున్నాయి. నాడు జగన్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీరు చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాకా ఆ పని చేస్తామని హుంకరించారు. అయితే మాట తప్పి మడమతిప్పి ఇప్పడు అదే పరిశ్రమ ప్రారంభోత్సవానికి సీఎం హోదాలో వెళుతున్నారు. దీనికి ఆయన ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదు. అదీ జగన్ స్టైల్.నాడు జనాల ఉసురు తీయాడానికే గ్రాసిమ్ కెమికల్ ఫ్యాక్టరీ అన్న జగన్ ఇప్పుడు తొలి దశలో ఐదు వేల మందికి ఉపాధి కల్పించే కల్పతరువుగా అదే ఫ్యాక్టరీని అభివర్ణిస్తున్నారు. మరి అప్పటి ఉద్యమాలలో కేసుల్లో ఇరుక్కున్న వారి మాటేమిటంటే నోరు విప్పడం లేదు. అధికారం కోసం కనిపించిన ప్రతి దానినీ ఖండించేసిన ఆయన ఇప్పుడు అధికారంలో ఉండి నాడు వద్దన్న ప్రతి అంశాన్ని అక్కున చేర్చుకుని అందలం ఎక్కిస్తున్నారు. నాడు జనంలో ఉద్రేకతలను రెచ్చగొట్టి వారు కేసుల్లో చిక్కుకుని విలవిలలాడిన సంగతిని ఇప్పుడు పూర్తిగా మర్చిపోయి అక్కడికే అదే పరిశ్రమ ప్రారంభోత్సవానికి కించిత్తైనా వెరవకుండా వెడుతున్నారు. ఆయన నాడు- నేడు కార్యక్రమంలో జగన్ తీరును కూడా చేరిస్తే ఇంకా బాగుంటుంది కదా! జగన్ లో నాటికీ- నేటికీ ఎంత మార్పు అని జనం ఆశ్చర్యపోయేలా జగన్ మేకోవర్ ఉందని పరిశీలకులు అంటున్నారు.