2018 -19 విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు జిల్లాలకు చేరుకున్నాయి. ఇప్పటికే మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు రావడంతో పాఠశాలల వారీగా పాఠ్యపుస్తకాలను పంపిణీ కార్యక్రమంను అధికారులు షురూ చేశారు. మే 25 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలను అందించనున్నారు. జూన్ 1న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి ప్రతివిద్యార్థికి పాఠ్యపుస్తకాలను అందిస్తారు. జిల్లాలకు కావాల్సిన పాఠ్యపుస్తకాలపై 2018 ఏప్రిల్‌లో విద్యాశాఖ డైరెక్టరేట్‌కు అధికారులు తరగతుల వారీగా ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు జిల్లాల పరిధిలోని ఠశాలల విద్యార్థులకు సరిపడేలా 85,81,493 పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. స్కూల్స్ ప్రారంభానికి వారం రోజుల ముందే పాఠ్యపుస్తకాలను చేర్చడం జరుగుతుందని తెలిపారు. చైల్డ్ ఇన్ఫోలో పేర్లుండి ఆధార్‌కార్డు ఉన్న వారికే పాఠ్యపుస్తకాలిస్తారు.. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పుస్తకాలివ్వడం కుదరదని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని, ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఆధార్, చైల్డ్ ఇన్ఫో ప్రయోగంతో ఉచిత పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టడాన్ని అరికట్టవచ్చని పేర్కొన్నారు. అయితే నూతనంగా అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు ఆధార్ లేకున్నా, స్కూల్ ఇన్ఫోలో పేరు లేకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో బయోమెట్రిక్ స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల కిందట ఆదేశాలు జారీ అయ్యాయని, ఆధార్, చైల్డ్ ఇన్ఫోలో పేర్లు నమోదు కానీ విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో బయోమెట్రిక్ స్వీకరించి పాఠ్యపుస్తకాలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సేల్ పుస్తకాలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని, ఆయా వివరాలను సమర్పిస్తేనే పాఠ్యపుస్తకాలను ఇస్తామని పేర్కొన్నారు