రాయ్ పూర్, ఏప్రిల్ 22,
మావోయిస్టులు. దట్టమైన అడవులే వారి అడ్డా. రాళ్లు, రప్పలు, చెట్ల మాటున మనుగడ సాగిస్తుంటారు. ఉనికి కోసం అప్పుడప్పుడు దాడులకు తెగబడుతుంటారు. నిత్యం పోలీసులు, స్పెషల్ ఫోర్సెస్‌తో బతుకు పోరాటం చేస్తుంటారు. ఎంతకా ఉక్కుపాదం మొపుతున్నా.. ఎంతమంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేస్తున్నా.. ఇప్పటికీ అడవిబిడ్డలు, ఎర్రజెండాలు పోలీసులకు కఠిన సవాళ్లే విసురుతున్నారు. ఇటీవల మావోల దాడులు మరింత పెరగడంతో.. భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. తొలిసారి వైమానిక దాడులతో సంచలనం రేపాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జీజాపూర్ జిల్లా బస్తర్‌లో తమపై వైమానిక దాడులు జరిగినట్టు మావోయిస్టుల కమిటీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగిన ఈ దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నట్టు తెలిపింది. కొట్టాం, రసం, ఈరం, సకిలేర్, మడప, దూలెడ్, కన్నెమార్క, పోతేమంగుం, బోతం ప్రాంతాల్లో ఈ వైమానిక దాడులు జరిగినట్టు వెల్లడించింది. అయితే అవి పక్కాగా వైమానిక దాడులా.. లేక డ్రోన్ అటాక్స్ చేశారా అనే విషయంలో స్పష్టత లేదు. అదేదో బోర్డర్‌లో.. శత్రుదేశంలో ఎయిర్ అటాక్ చేసినట్టు.. దేశంలోనే.. మన భూభాగంలోనే.. మన భద్రతా దళాలే.. ఇలా వైమానిక దాడులు చేయడం ఒకింత ఆశ్చర్యకరమే. ఇన్నాళ్లూ.. గన్ టు గన్ జరిగిన పోరు.. ఇప్పుడిలా ఎయిర్ అటాక్స్ స్థాయికి చేరుకోవడం సంచలనమే..అంటున్నారు.