హైదరాబాద్, ఏప్రిల్ 22,
లోక్ సభ ఎన్నికలకు ఇంకా నిండా రెండేళ్ళ సమయముంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కూడా లోక్ సభ ఎన్నికలతో పాటే జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలకు ఓ ఐదారు నెలల ముందు 2022 చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రలలో, ఇప్పటి నుంచే ఎన్నికల వేడి కాకరేపుతోంది. అలాగని ముందస్తు ఎన్నికలు ఏమైనా వస్తున్నాయా అంటే, అలాంటి అవకాశమే లేదని, అక్కడా, ఇక్కడా కూడా అధికార పార్టీ నాయకులు పదే పదేచెపుతూనే ఉన్నారు. తెలంగాణలో అయితే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ముచ్చటే లేదని ఒకటికి పదిసార్లు చెప్పుకొచ్చారు. అదే విషయం తెరాస ఉపాధ్యక్షుడు, మంత్రి కేటీఅర్ నిన్నటి వరంగల్ సభలో పునరుద్ఘాటించారు. అయినా, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం ముందస్తు తథ్యం అంటున్నారు.ముఖ్యమంత్రి లేదన్నారంటే,ఉందని అర్థం చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్ళినా అధికారం నిలబెట్టుకునే అవకాశమే లేనప్పుడు, ముందస్తుకు వెళ్లి ప్రయోజనం ఏమిటని తెరాసలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ముందస్తు ఉన్న లేకున్నా ఎన్నికల వేదుని మాత్రం కొనసాగించాలని, అన్ని పార్టీలు, ‘ఏకాభి ప్రాయం’ కు వచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే, ఏపీ ఆర్థిక పరిస్థితి, దినదిన ప్రవర్థమానంగా దిగజరిపోతున్న నేపధ్యంలో రాష్ట్రంలో “శ్రీలంక తరహా సంక్షోభం”తలెత్తక ముందే ముందస్తుకు వెళ్లి అదృష్టం పరీక్షించుకోవాలని జగన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, “గోడ మీది రాత చాలా క్లియర్” గా వుంది. ముందస్తుకు వెళ్ళే సాహసం జగన్ రెడ్డి చేయరు” అని పార్టీ నాయకులే ప్రైవేటు టాక్’లో అంటున్నారు.అంటే, తెలంగాణలో తెరాసను ఏ విధంగా అయితే ఓటమి భయం వెంటాడుతోందో, అంతకు 10 రెట్ల భయం ఏపీలో వైసీపీని వెంటాడుతోంది. సో.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.అయినా, ఉభయ రాష్ట్రాలలో అటు అధికార పార్టీలలో, ఇటు ప్రతిపక్షంలోనూ ఎన్నికల వేడి బుసలు కొడుతోంది. రేపో మాపో ఎన్నికలు ఖయాం అన్నట్లుగా ఎన్నికల ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయి.ఆంధ్ర ప్రదేశ్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్యాలెస్ గడపదాటి బయటకు వస్తున్నారు. ఇంచుమించుగా రెండేళ్లకు పైగా ప్యాలెస్’కే పరిమితమైన ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఇంతవరకు, అద్దాల మేడలో కూర్చుని అంతా బాగుందనే భ్రమల్లో ఉన్న ముఖ్యమంత్రికి, మంత్రివర్గ విస్తరణ అనంతర పరిణామాలు వాస్తవ పరిస్థితి అర్థమయ్యేలా చేశాయని పార్టీ నాయకులు అంటున్నారు. అందుకే ప్రస్తుతం ముఖ్యమంత్రి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగానే పార్టీ సంస్థాగత నిర్మాణం ఫై దృష్టి పెట్టారని అంటున్నారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో పాటుగా పార్టీ జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల నియామకాల చేపట్టారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే,జరగవలసిన నష్టం జరిగి పోయిన తర్వాత ముఖ్యమంత్రి ఇప్పుడు కళ్ళు తెరవడం వలన ప్రయోజనం ఉండదని, ఒక విధంగ ముఖ్యమంత్రి చేపట్టిన దిద్దుబాటు చర్యలు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉందని అంటున్నారు. అదలా వైసీపీ గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభించింది. ఇందలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులను ఆదేశించారు.మరోవంక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా,ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళనలు చేపడుతూనే, మరోవంక పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు, ఇతర సీనియర్ నేతలు జిల్లాలలో పర్యటించేందుకు ప్రణాకలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. మే నెల నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఉంటాయని సమాచారం. విధ్యుత్, బస్సు చార్జీల పెంపుదలకు నిరసనగా టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న బాదుడే బాదుడు ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటున్నారు. మే నెలలో నిర్వహించనున్న మహానాడు తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పాటు ప్రజల్లో ఉండే విధంగా లోకేష్ యాత్రకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవంక టీడీపీ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. ఆలాగే జనసేన్ అధినేత పవన్ కళ్యాణ్ రైతుల ఆత్మహత్యలఫై ఫోకస్ పెట్టారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను, పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. మరో వంక రాష్ట్ర ప్రజానీకంలో చైతన్యంతోపాటు వైసీపీ దురాగతాలను ఎండగట్టడానికి త్వరలో హైమాండ్ అనుమతితో రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించి, ప్రజాధనాన్ని, ఆస్తులను దోచుకుంటున్న వారికి కంటికి మీద కునుకు లేకుండా చేస్తామని హెచ్చరించారు. సో ..ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి పెరిగిపోతోంది. మరో వంక ఎన్నికలు జరిగే వరకు ఇదే వేడి కొనసాగుతుందని, పరిశీలకులు అంటున్నారు.