హైదరాబాద్, ఏప్రిల్ 22,
తెలంగాణ రాష్ట్ర సమితిలో నిన్నటి వరకూ కనిపించిన ఆల్ఈజ్ వెల్ ఫీలింగ్ ఇప్పుడు కనిపంచడం లేదు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి కింది స్థాయి క్యాడర్ వరకూ ఒక విధమైన అలజడిలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది. వేధింపులు, అత్యాచారాలు, కబ్జాలు వంటి నేరాలలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు తేలిన నాయకులపై చర్యకు కూడా చర్యలు తీసుకునేందుకు అధినేత సాహసించలేని విచిత్ర పరిస్థితి ఇప్పుడు పార్టీలో కనిపస్తున్నది. మరో వైపు కాంగ్రెస్, బీజేపీల విమర్శల దాడిని ఎదుర్కొనే విషయంలో కూడా గతంలోలా పార్టీ నేతలు, కేబినెట్ సభ్యులు దూకుడుగా కనిపించడం లేదు. ఇందుకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంతరెడ్డిలు విమర్శలు, సవాళ్లతో విరుచుకుపడుతున్నా తెరాస వైపు నుంచి గతంలోల దీటైన సమాధానం రాకపోవడమే నిదర్శనం. ఈ నేపథ్యంలోనే వచ్చె నెల 6న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నాయి. కనీసం 5లక్షల మందితో సభ నిర్వహించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. రాష్ట్రంలో బీజేపీ దూకుడు మీద ఉన్నట్లు కనిపిస్తున్నా వాస్తవంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పట్టు పైనే తెరాస ఆందోళనగా ఉందని చెప్పాలి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహం పెరగిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ వరంగల్ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.పైకి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసమే పర్యటన అని చెబుతున్నప్పటికీ...రాహుల్ పర్యటనకు కాంగ్రెస్ ఏర్పాట్లు, ఆ పర్యటనకు జనసమీకరణ కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు స్పందన వంటి అంశాలపై ఆరా తీయడానికేనన్నది పరిశీలకుల అంచనా. అంతే కాకుండా తెరాస నుంచి కొందరు అసమ్మతి వాదులు, అసంతృప్తులు రాహుల్ సభ వేదికగా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయన్న సమాచారం కూడా కేటీఆర్ పర్యటనకు ఒక కారణంగా చెబుతున్నారు. అలా మారుతారనుకుంటున్న వారంతా ద్వితీయ, తృతీయ శ్రేణి వారే అయినా వారిని బుజ్జగించి పార్టీ మార్పు ఆలోచనను విరమింపచేయడమే లక్ష్యంగా కూడా కేటీఆర్ వరగంల్ పర్యటన పెట్టుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. మామూలు పరిస్థితులలో అయితే ఇటువంటి పార్టీ మార్పిళ్లకు టీఆర్ఎస్ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి ఉండేది కాదు.ప్రస్తుతం పార్టీ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లుతోందన్న విపక్షాల వమర్శల దాడి నేపథ్యంలో ఈ మార్పిళ్లను నివారించడం ద్వారా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ సభలో వారూహించినట్లుగా తెరాస నుంచి ఎవరూ వెళ్లకుండా నివారించడం ద్వారా విపక్షాల విమర్శలన్నీ వాస్తవాలు కావన్న సంకేతాన్ని జనాలకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్ వరంగల్ పర్యటన అంతరార్థంగా చెబుతున్నారు