YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నేతల మధ్య మాటల మంటలు

నేతల మధ్య మాటల మంటలు

హైదరాబాద్, ఏప్రిల్ 22,
తెలంగాణలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో రాజకీయ తాళింపు కుతకుతలాడుతోంది. విమర్శలు విమర్శలుగా కాకుండా అసభ్యపదజాలం ఉపయోగిస్తుండటం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. గతంలో సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలు అనరాని మాటలు అంటున్నాయని టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. అయితే, తాజాగా హన్మకొండలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలను దూషించిన తీరు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి ఉపయోగించిన పదాలు తెలంగాణ రాజకీయ చదరంగంలో మరోసారి రచ్చరేపాయి. నువ్వు ఒకటి అంటే నేను రెండు అని చూపిస్తా అన్నట్లుగా మారింది స్టేట్ పొలిటికల్ లీడర్ల పరిస్థితి. గతంలో సీఎం కేసీఆర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాలు సైతం అదే భాష తీరు అనుసరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత రాజకీయ విమర్శల్లో జుగుప్సాకత పెరిగిపోయింది. చివరకు అది నేతల మధ్య బాడీ షేమింగ్ వరకూ చేరుకుంది. ఒక దశలో మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులను సైతం రాజకీయాల్లోకి లాగడంతో పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత కొంత కాలం కాస్త మెరుగుపడిందనుకున్న నేతల భాష మరోసారి జడలు విప్పుకుంది. కేటీఆర్ చేసిన ప్రసంగంలో బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడిన తీరు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ విమర్శలు విమర్శల వరకు బాగానే ఉన్నా ఆయన వాడిన భాష మాత్రం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని తాము కూడా మోడీని నోటికి వచ్చినట్లు తిట్టగలం కానీ, తిట్టడానికి సంస్కారం అడ్డు వస్తుంది అంటూనే అనాల్సిన మాటలు అనేశాడనేది పొలిటికల్ కారిడార్‌లో జరుగుతోన్న ప్రచారం. ఇదే సభలో కేటీఆర్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాడీ షేమింగ్ కిందకు రావా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. గతంలో కేటీఆర్ కుమారుడిపై ఎలాంటి వ్యాఖ్యలు సరి కాదని చెప్పారో ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే నాయకులను ఉద్దేశించి కేటీఆర్ చేయడం హాట్ టాపిక్ అవుతోందిమంత్రి కేటీఆర్ హన్మకొండలో చేసిన విమర్శలపై గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చాడు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గతంలో ఉపయోగించిన పదజాలాన్ని వీడియో రూపంలో చూపించాడు. అంతటితో ఆగకుండా మంత్రి వాడిన భాషకు ఏ మాత్రం తగ్గకుండా కామెంట్లు చేశాడు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య భాషా సంస్కారంపై మాటల ఫిరంగులు పేలుతున్నాయి. ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం అంతే అగ్రెసివ్‌గా ముందుకు వెళ్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వపెద్దలపై ఓ రేంజ్‌లో పరుషపదాలతో విమర్శిస్తూ వస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి.రాజకీయ నాయకులు ఏది చేసినా వాటి వెనుక ఏదో పరమార్ధం దాగి ఉంటుంది. తెలంగాణలో నేతలు అల్లుతున్న తిట్ల పురాణం రాబోయే రోజుల్లో తమ తమ పార్టీలకు కలిసి వస్తుందనేది ఓ నమ్మకంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంత దూకుడుగా వెళ్తే అంత కలిసి వస్తుందనేది నేటి ట్రెండ్. ఎవరికి వారు తగ్గెదే లే అన్నట్లుగా తిట్ల దండకాలతో మసాల నూరుతున్నారు. ప్రజాస్వామ్యంలో విరమర్శలే ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచే సాధనాలు. ఏదైనా ఓ అంశంపై ప్రతిపక్షాలు లొసుగులను పసిగట్టి విమర్శిస్తే వాటిని సహేతుకంగా చూసుకుంటూ ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకుంటాయి. కానీ, మారుతున్న కాలంతో రాజకీయ చదరంగంలో తిట్లే తమ గెలుపుకు సోపానాలు అన్నట్లుగా నేతల ప్రవర్తన మారిపోతోంది. విమర్శిస్తున్న క్రమంలో ఉపయోగిస్తున్న భాష చాలా బాధ్యతాయుతంగా ఉండేలా చూసుకోవడం సంస్కారం. కానీ తెలంగాణలో మాత్రం నేతల మాటలు శృతి మించుతున్నాయి. చెవులకు చిల్లులు పడేలా తిట్టదండకాలు అల్లుతున్నారు నేతలు. ఇలాంటి ఓ దుష్ట సాంప్రదాయం తెలంగాణ రాజకీయాల్లో మంచిది కాదనేది పండితుల అభిప్రాయం. ఇకనైనా నేతలు తమ తీరును మార్చుకుంటారో లేక ఇలానే కంటిన్యూ అవుతారో కాలమే చెప్పాల్సిన సమాధానం.

Related Posts