హైదరాబాద్
గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదాపడింది. ఏపీ సభ్యుల ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరగాల్సిన ఈ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఇంజినీర్లు హాజరయ్యారు. కానీ ఏపీకి చెందిన ఒక్క అధికారి కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో బోర్డు ఈ సమావేశాన్ని వాయిదా వేసింది. ఏపీ సభ్యుల గైర్హాజరుతో మార్చి 11న కూడా భేటీ వాయిదా పడింది.ఏపీ సభ్యులు కావాలనే సమావేశానికి రాలేదని రజత్ కుమార్ అన్నారు. వరుసగా రెండు సార్లు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వారు హాజరుకాలేదని చెప్పారు. తెలంగాణకు సంబంధించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు బోర్డు ఆమోదం తెలపాలని వెల్లడించారు. ఏపీ సభ్యులు రాకపోవడంతో అనుమతులకు ఆలస్యమవుతోందని చెప్పారు. సీతమ్మసాగర్, తుపాకులగూడెంకు హైడ్రలాజికల్ అనుమతి వచ్చిందన్న తెలిపారు. ఆరు నెలల్లోపు అన్ని ప్రాజెక్టులకు అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై కేంద్రం ఇంకా ట్రైబ్యునల్‌కు నివేదించడం లేదన్నారు.