న్యూఢిల్లీ, ఏప్రిల్ 23,
2024 ఎన్నికలు సమీపానికి వచ్చే సరికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాలు, ఆ పార్టీకి ఉన్న పార్లమెంటు సభ్యుల బలంతో సంబంధం లేకుండా ఆ పార్టీ లేకుండా బీజేపీయేతర కూటమి ఏర్పడే అవకాశం లేదన్న నిర్ధారణకు బీజేపీయేతర పార్టీలు వచ్చేశాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఓట్లూ, సీట్లూ విషయంలో గతంలోలా కమాండింగ్ పొజిషన్ లో లేకపోయినా, ఆ పార్టీ లేకుండా బీజేపీని ఢీ కొనడం అంత తేలిక కాదని బీజేపీయేతర పార్టీలన్నీ దాదాపుగా నిర్ధారణకు వచ్చేశాయి. క్షేత స్థాయిలో ఆ పార్టీకి ఇప్పటికీ ఉన్న బలమైన పునాదులే అందుకు కారణం కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ జాతీయ స్థాయిలో ఫ్రంట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపాదనకు జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల నుంచి స్పందన లేకుండా పోయింది. ఆ దిశగా జరిగిన ప్రయత్నాలలో భాగంగా జరిగిన సమావేశాలలో కాంగ్రెస్ లేకుండా బీజేపీయేతర ఫ్రంట్ అసంభవమన్న అభిప్రాయాన్నే టీఆర్ఎస్ మినహా మిగిలిన బీజేపీయేతర పార్టీలన్నీ వ్యక్తం చేశాయి. దీంతో కేసీఆర్ పరిస్థితి వ్రతమూ చెడింది...ఫలతమూ దక్కలేదన్నట్లుగా తయారైంది. ఫ్రంట్ నేతగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామనుకున్న ఆయన ఆశలకు ఆదిలోనే హంసపాదు పడింది.
ఆది నుంచీ బీజేపీకి అన్ని విషయాలలోనూ మద్దతుగా నిలబడిన ఆయన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో బీజేపీ వ్యతిరేకులలో చాంపియన్ అనే ముద్ర కోసం ఆ పార్టీ వ్యతిరేక విధానాన్ని అవలంబించారు. అందులో భాగంగానే వడ్ల కొనుగోలు నుంచి....తెలంగాణకు మోడీ సర్కార్ అన్యాయం చేసిందంటూ ఆ పార్టీపై రణభేరి మోగించారు. ఆయన మోడీ సర్కార్ వ్యతిరేక వైఖరి కారణంగానే రాష్ట్రంలో అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న బీజేపీ ప్రతి విమర్శలతో పుంజుకుని తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగిందా అన్న భావన కలిగేలా కార్యక్రమాల జోరు పెంచింది. ఇప్పుడు మూడో ఫ్రంట్ ప్రయత్నాలు తుస్సుమనే సరికి కేసీఆర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీల ను ఢీ కొంటూ..ఒంటరిగా జాతీయ రాజకీయ యవనికపై తన ముద్ర చాటుకోవడానికి ప్రయత్నించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ దశలోనే ఆయన ఫ్రంటూ లేదు గింటూ లేదు...నేనే జాతీయ పార్టీ పెడతా అంటూ ప్రకటన చేసేశారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయి గుర్తింపునకు తాపత్రేయ పడటం కేసీఆర్ తోనే ప్రారంభం కాలేదు. ఆయనతోనే అంతం కాదు. కానీ ఇప్పటికప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం వల్ల అదనంగా చేకూరే ప్రయోజనమేమిటన్నదానిపైనే అందరి సందేహాలూ... ఢిల్లీలో కనీసం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానైనా కలవడానికి ఇష్టపడని ఆప్ చీఫ్ అరవింద్ క్రేజీవాల్ కూడా బీజేపీని ఎదుర్కోనే క్రమంలో కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు సంకేతాలిచ్చారు. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో అవసరమైతే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే దిశగానూ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాము ఐక్యంగా లేకపోతే బీజేపీకే ప్రయోజనం అనే విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించినట్లు తాజా ఉమ్మడి లేఖద్వారా తేటతెల్లం అయింది. కానీ కేసీఆర్ ను కనీసం బీజేపీ వ్యతిరేకిగా గుర్తించకపోవడం బహుశా మొన్నటిదాకా ఆయన వ్యవహరించిన తీరే కారణమనే విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏడేళ్లపాటు బేషరతుగా మద్దతు పలికి, మోదీ సర్కార్ చేసిన అన్ని చట్టాలనూ సమర్థించిన కేసీఆర్.. ఇప్పుడు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీని విభేదిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటిదాకా కేసీఆర్ కాంగ్రెస్‌తో కలిసి ఉన్న పార్టీల నేతలను కలిసి మాట్లాడారే తప్ప.. బీజేపీతో కలిసి ఉన్న పార్టీలను కలిసి, వాటిని ఒప్పించే ప్రయత్నాలు చేయలేదు. కనీసం పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం జగన్ ను కూడా కలవని వైనాన్ని ప్రధాన ప్రతిపక్షాలు గమనిస్తున్నాయి. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న కూటమి వల్ల విపక్షాల ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. అందుకే సంయుక్త ప్రకటనలో కేసీఆర్ పేరును చేర్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు.. కేసీఆర్–టీఆర్‌ఎస్‌లో బీజేపీ వ్యతిరేక పంథాలో నిలకడ ఎంత? అనే ప్రశ్న తలెత్తుతోందని విశ్లేషకులు అంటున్నారు.