విజయవాడ, ఏప్రిల్ 23,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రం కొర్రీలపై నివేదికలు సిద్ధం చేయడంలో ఆర్థికశాఖ తలమునకలవుతోంది. చేసిన అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు, వాయిదాలు వంటి ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని తేలుతున్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. కాగా చేసిన అప్పులపై కేవలం ఇద్దరు ఆర్ధికశాఖ అధికారులకు మాత్రమే అవగాహన ఉండడంతో వారిద్దరు మాత్రమే సమాధానాలు సిద్ధం చేసే ప్రక్రియలో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వారిద్దరే ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ. గత రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణాలపై పలు కోణాల్లో కేంద్రానికి, రిజర్వ్‌బ్యాంకుకు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఆరా తీయడం ప్రారంభించినట్లు తెలిసింది. ఇప్పటికే కొత్త రుణాలపై ఆంక్షలు విధిస్తున్న కేంద్రం, పాత అప్పులపైనా నివేదికలు కోరుతోంది. ఇప్పటికే తీసుకున్న బహిరంగ మార్కెట్ రుణాలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన గ్యారంటీల ద్వారా తీసుకున్న అప్పులు, వాటికి చెల్లిస్తున్న అసలుపై వాయిదాలు, వడ్డీల వివరాలు చెప్పాలని గత ఏడాది కాలంగా కేంద్రం, ఎజి కార్యాలయాలు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రాష్ట్రం నుంచి సరైన వివరాలు మాత్రం రావడం లేదని కేంద్ర ఆర్థికశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వార్షిక రుణాలపై రాష్ట్రానికి రాసిన లేఖలో మరోసారి ఇవే వివరాలను కేంద్రం అడిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు రావత్, సత్యనారాయణ స్వయంగా కూర్చొని కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ లెక్కలను తయారుచేసేందుకు వారు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. భారీగా రుణాలు తీసుకున్నప్పటికీ, వాటిని చూపడంలో సమస్యలు ఉంటాయని వారు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ స్వల్పంగా మాత్రమే రుణాలు చూపించిన ఆర్థికశాఖ, ఇప్పుడు వాస్తవ రుణాలు చూపిస్తే ఇబ్బందులు తప్పవని ఇతర అధికారులు అంటున్నారు. అందుకే లెక్కలు తయారీలో ఎలా ముందుకు సాగాలన్నది అర్థంకాక ఆర్థికశాఖ ఇబ్బందులు పడుతున్నట్లు ఆ శాఖ దిగువస్థాయి అధికారులు అంటున్నారు. మరో వైపు రుణ సేకరణకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఆ మొత్తంలో భారీ ఎత్తున కోత పెట్టడానికి సిద్దపడటమే దీనికి కారణం. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నుండి వచ్చిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం అనుమతిచ్చిందని భారీ మొత్తంలో అప్పులు చేసినప్పటికీ చేతికి వచ్చేది కొంచమే కావడంతో ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలన్న విషయమై ప్రభుత్వంలో మల్లగుల్లాలు సాగుతున్నాయి. గత సంవత్సరాల్లో ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి దాటి చేసిన రుణ మొత్తాన్ని ప్రస్తుత సంవత్సరంలో మినహాయించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందాయి. నిజానికి ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుండో కోరుతున్నాయి. ఆ విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు పెడచెవిన పెట్టిన కేంద్రం పరిమితిని మించారంటూ ఈ ఏడాది కోతలకు సిద్దపడింది. దీంతో పాటు గ్యారంటీల ద్వారా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలను కూడా ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోకి చేర్చాలని నిర్ణయించింది. ఈ రెండు నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన రుణాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు అంటున్నారు. రాష్ట్ర స్థూల అభివృద్ధిలో 3.5 శాతం రుణాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 44,574 కోట్లు రుణంగా తీసుకోవచ్చు. విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకుగాను 0.50 శాతం అదనపు రుణాన్ని ఇవ్వాలని కేంద్రం గతంలోనే నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 2,229 కోట్ల రూపాయల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే కేంద్రం చెప్పిన పెట్టుబడి వ్యయాన్ని సాధించినందుకు మరో 5,309 కోట్లు అదనపు రుణంగా తీసుకునేందుకు అనుమతి లభించింది. దీంతో మొత్తంమీద 52,112 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రుణంగా లభించనుంది. అయితే, గతంలో ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిమించి తీసుకున్న రుణాన్ని ఈ ఏడాదే మినహాయించాలని నిర్ణయించడంతో వాస్తవంగా ఎంత మొత్తం రాష్ట్ర ఖజానాకు వస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇది కాకుండా ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల ద్వారా అనేక కార్పొరేషన్లు ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకుంటున్నాయి. తరువాత ఈ రుణాలను వక్తిగత డిపాజిట్ ఖాతాల ద్వారా ప్రభుత్వం తీసుకుని ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పష్టమైన ఎస్‌పివి (స్పెషల్ పర్పస్ వెహకల్) ఏర్పాటుచేసి దాని ద్వారా కాకుండా తీసుకున్న రుణాలను కూడా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిలోకే తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. సొంత ఆదాయంలో 90 శాతం వరకు గ్యారంటీలు ఇచ్చేందుకు అవకాశం ఉండగా, కొద్ది నెలల క్రితం దానిని 180 శాతానికి పెంచుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా సేకరించే మొత్తం కూడా ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోకి వస్తే బహిరంగ మార్కెట్లో తీసుకునే రుణాలు మరింత తగ్గుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.