YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ రైల్వే జోన్ అడుగులు

విశాఖ రైల్వే జోన్ అడుగులు

విశాఖపట్టణం, ఏప్రిల్ 23,
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల నెరవేర్చేందుకు రైల్వే అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. విశాఖపట్నంలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దక్షిణ కోస్తా జోన్‌కు సంబంధించిన డీపీఆర్‌ ఆధారిత తుది ప్రక్రియ చివరి దశకు చేరుకుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొత్త జోన్‌లో 54,500 మంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉందని డీపీఆర్‌లో పొందుపరిచిన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపైనా కసరత్తులు జరుగుతున్నాయి. కొత్త జోన్‌ ఏర్పాటైతే.. ప్రస్తుతం ఉన్న వనరుల ఆధారంగా వార్షికాదాయం సుమారు రూ.15 వేల కోట్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను సమర్థంగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా జోన్‌ ఏర్పాటు అయినప్పుడు 30 నుంచి 40 వేల మంది ఉద్యోగులతో విధులు మొదలు పెట్టేవారు. క్రమంగా ఆ సంఖ్యను పెంచుతుంటారు. కానీ సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు మాత్రం 65,800 అవసరం అని డీపీఆర్‌లో పొందుపరిచారు. అయితే కార్యకలాపాలు ప్రారంభమైన సమయంలో మాత్రం 54,500 మంది అవసరమని నిర్ధారించారు. వాల్తేరు డివిజన్‌ కార్యాలయంలో 17,985 మంది, వాల్తేర్‌ డీఆర్‌ఎం కార్యాలయంలో 930 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని రెండు డివిజన్లకు సర్దుబాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. అలాగే విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు సౌత్‌ కోస్ట్‌ జోన్‌ పరిధిలోకి వస్తున్నాయి. ఈ మూడు డివిజన్లలో కలిపి మొత్తం 50 వేల ఉద్యోగులను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త జోన్‌ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు(డీపీఆర్‌)ని రైల్వే బోర్డు అధికారులు స్టడీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు జోన్‌లో ఉండనున్నాయి. జోన్‌ కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఎలా మొదలు పెట్టాలి? ఉద్యోగుల సర్దుబాటు ఎలా నిర్వహించాలి? డివిజన్లతో సమన్వయం ఎలా కుదుర్చుకోవాలి? జోన్‌ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు మొదలైన అంశాలపై కసరత్తులు జరుగుతున్నాయి. అదేవిధంగా వివిధ కేటగిరీల రైల్వే స్టేషన్లు, వాటిని కొత్త జోన్‌లో అభివృద్ధి చేసేందుకు ఉన్న వనరులు, జోన్‌ కేంద్రంగా కొత్తగా నడపాల్సిన రైళ్లు, తదితర అంశాల్ని క్రోడీకరిస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. మూడు డివిజన్ల నుంచి వచ్చే ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకొని ఈ జోన్‌ నుంచి వార్షికాదాయం 2018–19 గణాంకాల ప్రకారం రూ.12,200 కోట్లు(డీపీఆర్‌ తయారు చేసినప్పుడు)గా గణించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రూ.15 వేల కోట్లు సమకూరే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
జోన్‌ స్వరూపమిదీ..
జోన్‌ : సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌
జోన్‌ పరిధిలో డివిజన్లు : విజయవాడ, గుంతకల్లు, గుంటూరు
రూట్‌ లెంగ్త్‌ : 3,496 కి.మీ
రన్నింగ్‌ ట్రాక్‌ లెంగ్త్‌ : 5,437 కి.మీ
సరకు రవాణా : 86.7 మిలియన్‌ టన్నులు
రాకపోకలు సాగించే ప్రయాణికులు : 192.5 మిలియన్లు
జోన్‌ పరిధిలో ఉన్న పోర్టులు : విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ
మేజర్‌ స్టేషన్లు : విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి
జంక్షన్లు : 26
ఏ–1,ఏ,బీ కేటగిరీ స్టేషన్లు : 46
సీ,డీ,ఈ,ఎఫ్‌ కేటగిరీ స్టేషన్లు : 141
పాసింజర్‌ హాల్ట్‌ స్టేషన్లు : సుమారు 170
వైఫై సౌకర్యం ఉన్న స్టేషన్లు : 61 స్టేషన్లు
జోన్‌ నుంచి నడిచే రైళ్లు : సుమారు 500
జోన్‌ పరిధిలో ఉన్న మెకానికల్‌ వర్క్‌షాపులు : తిరుపతి, రాయనపాడు, వడ్లపూడి (త్వరలో ఏర్పాటు కానుంది)
కోచ్‌ మెయింటెనెన్స్‌ డిపోలు : విశాఖపట్నం, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం విజయవాడ, గుంటూరు, తిరుపతి, గుంతకల్లు
డీజిల్‌ లోకో షెడ్లు : విశాఖపట్నం, గూటీ, గుంతకల్లు, విజయవాడ
ఎలక్ట్రికల్‌ లోకోషెడ్లు : విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు
రైల్వే హాస్పిటల్స్‌ : విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, రాయనపాడు, గుంటూరు

Related Posts