ఖమ్మం, ఏప్రిల్ 23,
టీఆర్ఎస్ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరాచకపాలన నడుస్తోందని.. అధికార పార్టీ నేతలు పోలీసులను కీలుబొమ్మలుగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని ఈరోజు కిషన్ రెడ్డి పరామర్శించారు. కొద్దిరోజుల్లో పెళ్లి కావాల్సిన ఒక సామాన్య కార్యకర్తని.. వేధింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని కేసీఆర్, కేటీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలపైకి వదిలేశారని.. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు కనీసం బయటికి రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందన్నారు. కొద్దినెలల కిందట కొత్తగూడెంలో అధికార పార్టీ నేత కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈరోజు ఖమ్మంలో అలాంటి పరిస్థితులు దాపురించాయని.. అరాచకాలు పెరగిపోయాయన్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను వేధింపులకు గురిచేయడం.. రౌడీషీట్లు ఓపెన్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని.. 1200 మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు. అమరవీరుల త్యాగాలు వృథా పోవని.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ప్రజలు ఎలా గెలిపించారో వచ్చే ఎన్నికల్లో అలాగే ఓడిస్తారని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ ప్రశ్నిస్తే తెలంగాణ సెంటిమెంట్‌కి ముడిపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబ పాలనకు త్వరలోనే చరమగీతం పాడుతారని.. బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మబలిదానం వృథా పోదన్నారు.
కులంపై వ్యతిరేకతతోనే ఆరోపణలు
బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసుతో వివాదంలో ఇరుక్కున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వైరాలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజికవర్గం నుంచి తానొక్కడినే మంత్రిగా మిగిలానని ఆయన అన్నారు. మనందరం ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మంలో చిన్న సంఘటన జరిగితే కొందరు కుటిల రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు
కొందరు సూడో చౌదర్లు కుటిల రాజకీయ నేతలతో కలిసి తనపై రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్మ జాతి సభ్యులందరూ ఐక్యంగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. తనపై కావాలనే కొందరు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించి బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి కృషి చేశారని.. అదే తరహాలో సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలను న్యాయం చేస్తున్నారని పువ్వాడ అన్నారు.ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న మంత్రి పువ్వాడ కమ్మ సంఘం సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావుతో మంత్రి పువ్వాడకు విభేదాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. నేతల నడుమ ఆధిపత్య పోరు నడుస్తోందన్న వాదనలున్నాయి. తుమ్మల అనుచరులపై అక్రమ కేసులు పెట్టించి జైలుకి పంపించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో అందరం ఐకమత్యంగా ఉండాలని మంత్రి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.