YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పూజారే హంతకుడు..

పూజారే హంతకుడు..

హైదరాబాద్, ఏప్రిల్ 23,
మల్కాజిగిరి విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌ కాలనీలో మహిళ హత్య కేసు చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. విచారణలో సంచలన విషయాలు.. వెలుగుచూశాయి. ఆలయ పూజారే.. మహిళను ఆశీర్వదిస్తానని చెప్పి.. అంతం చేశాడు. ఆమె ఒంటిపై నగల కోసం అత్యంత పాశవికంగా చంపేశాడు.  ఈ కేసులో ప్రధాన నిందితుడు అనుముల మురళీ కృష్ణ అలియాస్‌ కిట్టూ(40), నగల వ్యాపారి జోషి నందకిషోర్‌(45)ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే..  విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌ కాలనీకి చెందిన ఉమాదేవి అనే మహిళ సోమవారం సాయంత్రం బయటకు వెళ్లి.. తిరిగిరాలేదు. అన్నీ చోట్లా వెతికిన ఆమె భర్త జీవీఎన్‌ మూర్తి.. ఆచూకి దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెర్చింగ్ మొదలెట్టిన పోలీసులకు.. గురువారం ఉదయం కాలనీ సమీపంలోని టెంపుల్ వెనుక డెడ్‌బాడీ కనిపించింది. ఒంటిపై నగలు లేకపోవడంతో.. వాటి కోసమే హత్య చేసినట్టుగా పోలీసులు భావించి ఆ కోణంలో ఫోకస్ పెట్టారు. ఇక్కడే తీగ లాగితే.. డొంక కదిలింది. చుట్టు పక్కల సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఉమాదేవి గుడికి వచ్చి వెనక్కి వెళ్లలేదని, ఆమె చెప్పులు ఆలయంలోనే వదలి వెళ్లినట్టు గుర్తించారు. అర్చకుడి కదలికలపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. పూజారితో పాటు నగలు కొన్న షాపు యజమానిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
అక్షింతలు వేస్తానని చెప్పి….
నిందితుడు విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌ కాలనీలోని స్వయం భూ సిద్ది వినాయకస్వామి టెంపుల్ అర్చకుడు. అతడి పేరు మురళీకృష్ణ. ప్రకాశం జిల్లా పామూరు పట్టణానికి చెందినవాడు. సిటీకి వచ్చి మల్కాజిగిరి వచ్చి ఆలయంలో నాలుగేళ్లుగా అర్చకుడిగా పనిచేస్తున్నాడు. కాగా గత 2 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో ఉండే ఉమాదేవి రోజూ సాయంత్రం ఒకే సమయానికి గుడికి రావటం గమనించాడు. తన అప్పుల నుంచి బయటపడేందుకు ఉమాదేవిని చంపి నగలు కాజేయాలని పథకం రచించాడు. ఆలయ పరిసరాల్లోని 8 సీసీ టీవీ కెమెరాలు పనిచేయకపోవటాన్ని తనకు అనువుగా మార్చుకున్నాడు. రోజు మాదిరిగానే ఆమె సోమవారం సాయంత్రం 6.30కు ఆలయానికి వచ్చి పూజలు చేశారు. వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అక్షింతలు వేస్తాను ఉండమన్నాడు. ఆమె వంగిన క్రమంలో అప్పటికే  తెచ్చి పెట్టుకున్న ఇనుపరాడ్‌తో ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఒంటిపై నగలన్నీ తీసుకున్నాడు. అదే రోజు నగలు అమ్ముకుని డబ్బు తీసుకున్నాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు.

Related Posts