- మరో భారీ సంస్కరణకు శ్రీకారం..
- అర్థం చేసుకున్న ఆర్థిక మంత్రి
- ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వ్యాఖ్య
ప్రధాని మోదీ సర్కారు మరో భారీ సంస్కరణకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సంస్కరణలను ప్రవేశపెట్టాక ఇప్పుడు మరోసారి అటువంటి భారీ నిర్ణయం ఒకటి ఈ బడ్జెట్‌లో వెలువడవచ్చని ఆర్థిక శాఖ భావిస్తోంది. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రకటించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన విధి విధానాలకు ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ, ప్రధానమంత్రి కార్యాలయం తుదిరూపును ఇచ్చినట్లు తెలిసింది. వేతన జీవులకు పన్ను రాయతీ అవసరమన్న విషయాన్ని ఆర్థిక మంత్రి అర్థం చేసుకున్నారని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించారు.
ఈ మినహాయింపు అమల్లోకి వస్తే వేతనజీవులకు కొంతమొత్తం మిగులుతుంది. ఉదాహరణకు ఒక వ్యాపారి కార్యాలయ అద్దె, డ్రైవర్ జీతం వంటి ఖర్చులకు ప్రభుత్వం పన్ను మినహాయింపును ఇస్తుంది. కానీ, వేతన జీవికి ఇటువంటి మినహాయింపులు ఉండవు. దీంతో వ్యాపారి కంటే ఉద్యోగి ఎక్కవ పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీఏ వంటివి కలిపి స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చే విషయానికి మాత్రం ఇంకా తుదిరూపు ఇవ్వలేదని సమాచారం. స్థూల వేతనంపై 10శాతం వరకు ఈ మినహాయింపు ఉండవచ్చని భావిస్తున్నారు. 2006 వరకు స్టాండర్డ్ డిడక్షన్ అమల్లో ఉండేది. రూ.5లక్షలు పైబడిన వేతన జీవులకు రూ.20వేలు మినహాయించేవారు. కానీ నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం దీనిని తొలగించారు.