శ్రీకాకుళం, ఏప్రిల్ 25,
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గ్రామంలో పరస్థితి ఇది. ఇక్కడ పూర్తిగా సవర గిరిజనులు నివాసం ఉంటారు. ఇటు పూర్తిగా మైదాన ప్రాంతం కాదు.. అలా అని పూర్తిగా ఏజెన్సీ కాదు. దుష్ట శక్తుల పేరుతో గ్రామం చుట్టు కంచె వేసారు గ్రామస్థులు. ఎనిమిది రోజులు పాటు గ్రామంలోకి బైట వ్యక్తులను అనుమతించడం లేదు. ఊరులోకి ఎవరిని రానీయకుండా చుట్టు ముళ్లకంపలు వేసారు. గ్రామంలోని స్కూల్ ని సైతం మూసి వేసారు. కొంతకాలంగా గ్రామంలో వరుసగా సంభవిస్తున్న మరణాలకు జంతు బలి ఇస్తూ ప్రత్యేక పుజలు నిర్వహించారు. ఊరికి అరిష్టం పట్టిందంటూ గత మూడు రోజులుగా మాంత్రికుల తో క్షుద్ర పూజలు నిర్వహించారు గ్రామస్థులు. గత కొన్నిరోజులుగా గ్రామంలో కొందరు జ్వరంతో బాధపడుతున్నారు. ఒకరిద్దరు చనిపోయారు. దీంతో గ్రామానికి దుష్టశక్తులు ఇబ్బంది పెడుతున్నాయంటూ..ఊరంతా బలంగా నమ్మింది. గ్రామ పెద్దలు ఒడిశా, విజయ నగరం ప్రాంతాలకు చెందిన మంత్రగాళ్లను సంప్రదించారు. అమాయక ప్రజలు పడుతున్న ఆందోళనలను గుర్తించిన మాంత్రికులు, గ్రామంలో భయంకరమైన శక్తులు తిష్టవేసాయని నమ్మ బలికించారు. ఊరు బాగుండాలంటే తాము చెప్పినట్లుగా చేయాలని ఉదరగొట్టారు. దీంతో ఊరంతా ఒక్కటై గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారు. గ్రామానికి నాలుగు దిక్కులు నిమ్మకాయలు పెట్టారు. గ్రామంలో రాకపోకలు సాగిస్తే ..ఆ శక్తులను కట్టడి చేయలేమని మాంత్రీకులు బెదిరించారు. ఒకట్రెండురోజులు కాదు ఈనెల 17 నుంచి 25 వరకూ ఈ కట్టడి అమలు చేస్తున్నారు. తొలుత ఈనెల 17 నుంచి 20వ వరకు రాకపోకలను నిషేధించారు. అయినా దుష్టశక్తులు పవర్ తో కట్టడి చేయలేక పోతున్నామంటూ మరో ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 25 వరకు పొడిగించారు. అంతవరకు ఎవరూ బయటకెళ్లొద్దని, బయటవారు రావద్దని హెచ్చరిక జారీ చేసి గ్రామానికి వచ్చే రహదారిని మూసేశారు. పాఠశాల, అంగన్ వాడీ కేంద్రాలు తెరవడం లేదు. సచివాలయ పరిధిలో పనిచేసే ఉద్యోగులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులను రావద్దని హెచ్చరించారు. విజ్ఞాన ప్రపంచం పరుగులు పెడుతున్న తరుణంలో, వెన్నెలవలసలో మాత్రం విచిత్ర పరిస్థితి దాపురించింది. మూఢ నమ్మకాలను నమ్మవద్దని.. అనారోగ్యానికి వైద్యం చేయించాలని అధికారులు మొత్తుకుంటున్నా స్దానికులు నమ్మడం లేదు. పైగా ఆనవాయితీగా చేసిన పూజలని గ్రామస్తులు కొందరు మెండికేస్తున్నారు.