కాకినాడ, ఏప్రిల్ 25,
కారం మిరపకాయలు రేటుచుక్కలు చూపిస్తున్నాయి. వీటికి నేనేం తక్కువ అన్నరీతిలో వున్నాయి నూనెల ధరలు. అన్ని ధరలు పెరిగి ఆవకాయ పెట్టుబడి రెండింతలు అవుతుంది. దీంతో ఈ ఏడాది ఆవకాయ ఘాటెక్కింది. పచ్చడి పెట్టాలంటే వేలరూపాయలు చేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వందకాయలతో పచ్చడి పెట్టాలంటే ప్రస్తుత ధరల ప్రకారం చేతిలో పది వేల రూపాయలు ఉండాలి. ఇదే 50కాయలతో అయితే నాలుగు వేల రూపాయలు వరకైనా చేతిలో ఉండాల్సిందే. దీనికి కారణం పచ్చడికాయ దిగుబడి తగ్గిపోవడం, తయారీకి అవసరమైన సరుకుల ధరలు కొండెక్కడమే.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పచ్చడికాయ ఎక్కువగా రాజానగరం, గోకవరం, ఏజెన్సీ మండలాలతోపాటు తుని తదితర ప్రాంతాల్లోనే పండుతోంది. మెట్టప్రాంతాల నుంచి కూడా కాయ వచ్చేది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఏడాది చాలాచోట్ల పూత దశలోనే రాలిపోయింది. అక్కడక్కడ అరకొరగా కాయలు కనిపిస్తున్నాయి. మరో పది రోజులు తర్వాత మార్కెట్లోకి కాయ రానుంది. సాధారణంగా పచ్చడికాయ ధర కాయ సైజును బట్టీ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా దేశవాళీ హైజర్లు, చిన్న, పెద్ద రసాలు ఆవకాయకు వాడుతుంటారు. ఎక్కువకాలం ముక్క మెత్తబడకుండా ఉండేందుకు కాయ కొనుగోలు చేసేటప్పుడు రాజీ పడరు.గతంలో ఈ రకం కాయలు సైజ్ ని బట్టి 10 నుంచి 15 రూపాయలు ఉండేది. ప్రస్తుతం దిగుబడి లేకపోవడంతో కాయ 20 నుంచి 30 రూపాయల మధ్య ఉండవచ్చన్న వాదనలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. ఈ లెక్కన వందకాయలు కొనాలంటే 3వేల రూపాయలు ఉండాల్సిందే. ఇక పచ్చడి కారం ప్రధానం. గతంలో ఎన్నడూ లేనివిధంగా మిరపకాయలు ధరలు ఘాటెక్కాయి. కేజీ మేలు రకం 650 రూపాయలు పలుకుతుంది.ఇక మిల్లులో ఆడించాలంటే కేజీకి 70 రూపాయలు అవుతుంది. ఇవన్నీ కాకుండా బ్రాండెడ్ కారం కేజీ ప్రస్తుత ధర 750 రూపాయలు ఉంది. వందకాయల పచ్చడి. పెట్టాలంటే మూడున్నరనుంచి నాలుగుకేజీల కారం అవసరం. అంటే కారానికి 3వేల రూపాయలు ఖర్చవుతుంది. నూనె ధరలు సలసలా మరుగుతున్నాయి. సాధారణంగా పచ్చడిలో నువ్వులనూనె వాడతారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ 400 రూపాయలు ఉంది. వందకాయల పచ్చడి పెట్టాలంటే ఐదుకేజీల నూనె పడుతుంది. అంటే నూనెకు 2వేల రూపాయలు వెచ్చించాల్సిందే.ఇక ఆవపిండి కూడా మూడుకేజీల వరకు అవసరం. కేజీ 200 రూపాయలు ఉంది. ఈ లెక్కన మూడు కేజీలకు 600 రూపాయలు ఖర్చు, ఉప్పుకు వంద రూపాయలు అవుతుంది. ఇక మెంతులకు కూడా ఇదే ఖర్చు. ఈ లెక్కన ఈ ఏడాదిలో పచ్చడి పెట్టాలంటే 8వేలు నుండి పది వేల రూపాయలు వరకు చేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ధరలను చూసి ఇప్పట్నుంచే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆవకాయ పచ్చడి పెట్టగలమా.. అనేక ఆందోళనలో పడ్డారు. అసలు ఆవకాయ పచ్చడి లేకుండా రేపటినుంచి భోజనం ఎలా చేయాలో అర్థంకావడం లేదంటున్నారు జనం.