బాధ్యతారహితంగా తన హోదాను మరిచి, తాను పనిచేస్తున్న ధార్మిక క్షేత్ర ప్రతిష్ఠను దిగజార్చే విధంగా మాట్లాడిన రమణదీక్షితులు పై టీటీడీ చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కే ఈ కృష్ణమూర్తి స్పష్టం చేసారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. తిరుమల ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం, దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. తిరుమల అధ్యాత్మికతకు భంగం కలిగిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలను ఈ ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు తన సాంప్రదాయ అర్చక వృత్తిని మరచి రాజకీయ వృత్తిని తీసుకున్నట్లు కనబడుతుంది. రాజకీయాల నుంచి శ్రీవారిని రక్షించుకోవాలని, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఓ సుభాషితాన్ని వెల్లడించారు. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఇతర అర్చకులకు ఆదర్శంగా ఉండాల్సిందిపోయి, ఆయన హోదాను మరిచి ప్రవర్తిస్తున్నారు. పక్క రాష్ట్రంలో పత్రికా సమావేశం పెట్టి, పవిత్ర క్షేత్రాన్ని దిగజార్చే విధంగా రమణదీక్షితులు మాట్లాడారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. ప్రధాన అర్చకునికి పత్రికా సమావేశాలు నిర్వహించి రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది తన హోదాను, నియమాలను అతిక్రమించి ప్రవర్తించడమే. పనిగట్టుకొని పక్క రాష్ట్రానికి పోయి ఆలయ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా వ్యవహరించడం ఏవిధంగా సమర్ధనీయం. ప్రధానార్చకులు తన ప్రధాన భాధ్యతను మరిచి రాజకీయాల గురించి, అవినీతి గురించి భాధ్యతారహితంగా మట్లాడాడం విస్మయం కలిగిస్తుందని అన్నారు. ప్రతీ సంవత్సరం నగలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విషయంలో జస్టిస్ జగన్నాధరావు కమిటీ , జస్టిస్ వాద్వా కమిటీ సమగ్రంగా విచారించి శ్రీవారి ఆలయంలో నగల వాడకం, వాటి భధ్రత విషయంలో పూర్తి సంతృప్తి ని తెలియజేశారని అయన గుర్తు చేసారు. స్వామివారి మీద భక్తి ఉన్న ప్రతీ ఒక్కరూ తిరుమల ప్రతిష్ఠను కాపాడేందుకు కృషి చేస్తారు. ఉన్నతమైన ఒరవడిని తీర్చిదిద్దవలసిన వ్యక్తే ఆలయ నిబంధనలను అతిక్రమించి తన మనవడిని అంతరాలయంలోకి తీసుకొని వెళ్ళడం, స్వయంగా తానే విఐపీల అతిధి గృహాలకు వెళ్ళి, వారికి ఆశీర్వచనాలు తెలపడం సాంప్రదాయ ఉల్లంఘన కాదా!, కాకపోతే మరెందుకు వెళ్లినట్లు, స్వామి సేవకంటే ధనికుల సేవే ఆయనకు పరమావధన అయన విమర్శించారు. రాజ్యాంగం, చట్టాలు ఆధారంగా టీటీడీ పాలకమండలి ఏర్పడుతుంది. అది భక్తుల మనోభావాల కనుగుణంగా ప్రాచీన హిందూమత సాంప్రదాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రమణదీక్షితులను ఈవేళ ఎవరైనా గౌరవిస్తున్నారంటే దానికి కారణం, స్వామివారి దగ్గర పనిచేయడమే! దాన్ని మరిచి, స్వామివారికి తనవల్లే ఇంత ప్రాచుర్యం వచ్చిందనే అహంతో తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పతనం ప్రారంభమైనట్లే.. ఏమైనా ఆయన చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం తిరుమల దేవాలయం లో ఆగమశాస్త్రాల ప్రకారం వేదవిహితంగా జరిపి ప్రతిష్ఠను పెంపోందించడానికి ప్రతీ చర్య తీసుకుంటుందని కేఈ అన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, తిరుమల ఔనత్యాన్ని స్వామివారి అనుగ్రంతో పెంపొందిస్తాం. కుహానా భక్తుల నిజస్వరూపాన్ని ఎండగడతాం. అర్చకుల్లో వున్న పరస్పర తగాదాలు ఈ విధంగా బహిర్గతమౌతున్నాయని అనుకుంటున్నాను. టీటీడీ లో ప్రతీ సంవత్సరం పటిష్ఠమైన ఆడిట్ జరుగుతుంది. ఫైనాన్సియల్ అడ్వైజర్ , ముగ్గురు ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో టిటిడి వ్యవహారాలు సాగుతాయి. తిరుమల ఆలయాన్ని గురించి ఎవరు అవాక్కులు, చవాక్కులు పేలినా తీవ్రమైన చర్యలు వుంటాయి. ఏ విధులు నిర్వహించడానికి నియమింపబడ్డారో, ఆ విధులు నిర్వహించడానికే కట్టుబడి వుంటే ఎంతో శ్రేయస్కరం. వీటిని అతిక్రమించి ప్రవర్తిస్తే ఎంత పెద్దవారైనా ఉపేక్షించం. ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించకూడదు, ప్రజలు ఇలాంటి చర్యలను గర్హించాలని అయన అన్నారు.