విజయవాడ
జిల్లాలు విభజనకి శ్రీకారం చుట్టిన సందర్భములో మీ దృష్టికి అప్పటి లోకసభ స్పీకర్ బాలయోగి గారి పేరు అమలాపురం జిల్లాకి, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో మరొక జిల్లాకి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచమే కొనియాడుతున్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టమని కోరడం జరిగిందని ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలో ముద్రగడ్డ పేర్కొన్నారు. బాలయోగి రాజకీయాలలోకి రాకముందు కోనసీమలో చాలా చిన్న వెడల్పుగల రోడ్లు ఉండేవని, సాయంత్రం అయితే ఇళ్ళలో దీపాలు కిరోసిన్ దీపాలకన్న చాలా తక్కువ కాంతితో వెలుగుతూ ఉండే యని, అంతేకాకుండా కాకినాడ నుండి అమలాపురం వెళ్ళాలంటే యానాం రేవు నుండి గోదావరిలో పడవపై వెళ్లడం జరిగేదని, అటువంటి కోనసీమకి ఎవరు ఏమనుకున్నా బాలయోగి తీవ్రమైన కృషివల్ల విశాలమైన రోడ్లు వేయించడంతో పాటు, బల్బులు, ట్యూబ్ లైటు కాంతి కన్నా ఎక్కువ వెలుతురుతో వెలిగే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా పడవ ప్రయాణం బదులు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేయడం కోసం యానాం ఎదుర్లంక బ్రిడ్జి సదుపాయం లాంటివి బాలయోగి చేశారని గుర్తు చేశారు. అలాగే ఆరోజులలో ఎన్. హెచ్-5 ని నాలుగు వరుసల రోడ్డుగా మార్పు చేయడానికి ఎన్.హెచ్ వారు రావులపాలెం మీదుగా కాకుండా కొవ్వూరు, దేవరాపల్లి మీదుగా గుండుగొలను వరకు చేయాలనే ప్రయత్నానికి అడ్డు పడి ఉన్న రోడ్డుని రావులపాలెం మీదుగా నాలుగు వరుసలు చేయండి. అలాగే మీరనుకున్నట్లుగా కొవ్వూరు, దేవరాపల్లి, గుండుగొలను రోడ్డు కూడా చేయండి. అంతేగాని పూర్వం నుండి ఉన్న ఎన్. హెచ్-5ని మార్చవద్దని వారు చెప్పడం మూలంగా నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం అయ్యిందన్నారు. ఇలాంటి సదుపాయాలు ఎన్నో చేసిన మహావ్యక్తి బాలయోగి అని కొనియాడారు. వారి పేరు కోనసీమ జిల్లాకి పెట్టడం న్యాయమని ముఖ్యమంత్రికి తెలియజేసుకుంటున్నట్లు తెలిపారు. అవసరం అయితే తాను రాసింది వాస్తవం అవునో కాదో ఎంక్వయిరీ చేసుకుని నిజమైతేనే అదిశగా ఆలోచన చేయమని కోరుచున్నానండి. అలాగే డాక్టర్ అంబేద్కర్ గురించి నాలాంటి వ్యక్తి వ్రాయవలసిన అవసరం లేకుండానే వారి చరిత్ర ప్రపంచానికి తెలుసండి. అటువంటి మహనీయులు పేరు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో మరొక జిల్లాకి పెట్టమని కోరుచున్నానండి. బాలయోగి, డా.అంబేద్కర్ లాగ ప్రపంచనేత కాకపోయిన కోనసీమ అభివృద్ధికి కష్టపడ్డ మహనీయులు అటువంటి చరిత్ర పురుషులను గౌరవించడం కోసం తమరు పెద్ద మనస్సు చేసుకుని చరిత్రలో నిలిచిపోయే ఆలోచన చేయమని మరొకసారి కోరుచున్నాం అంటూ ముద్రగడ్డ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ప్రస్తావించారు.