కర్నూలు ఏప్రిల్ 26,
వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా ప్రాంతాలు మంచినీటి కోసం ఏకంగా యుద్దాలు చేయాల్సిన పరిస్థితి. బిందెడు నీటి కోసం గంటల తరబడి ఎదురుచూసి, అడ్డొచ్చిన వారిని పక్కకు తోసి, ఇలా మంచినీటి కోసం వారంతా మహా నీటి యజ్ఞమే చేయాల్సి వస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని హత్తి బెలగల్ గ్రామంలో వేసవి వచ్చిందంటే చాలు తాగునీటి కష్టాలు వర్ణనాతీతం. 10 రోజులకు ఒకసారి వచ్చే నీటి కోసం ఇక్కడి స్థానికులు యుద్ధమే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామం మొత్తానికి కేవలం ఒకటే నీటి ట్యాంకు ఉండటం వల్ల గ్రామస్తులు అందరూ ట్యాంక్ దగ్గరికి వచ్చి నీటిని పట్టుకోవాల్సి వస్తోంది. దీంతో తమ అవసరానికి సరిపోయేలా నీరు దొరుకుతుందో లేదోనని గ్రామస్తులు పోటీ పడి మరీ నీటిని సొంతం చేసుకుంటారు. ఈ నీటి కోసం వీరు పడే కష్టం ఓ యుద్ధమే తలపిస్తుంది. అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది.పిల్లలకు సెలవు కావడంతో వారి తల్లులకు నీటిని పట్టించేందుకు ట్యాంక్ దగ్గరికి వస్తారు. అయితే నీటిని పట్టుకునేందుకు ఒకరికొకరు పోటీ పడుతుంటారు. దీంతో వారి అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుంది. మంత్రి జయరాం సొంత నియోజకవర్గ పరిధిలోని ఆలూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హత్తి బెలగల్ గ్రామం.వేసవిలో ఇక్కడి ప్రజల కష్టాలు చెప్పరానివి. వేల మంది జనాభా కలిగిన గ్రామానికి బాపురం రక్షిత మంచినీటి పథకం నుంచి మాత్రమే నీటి సరఫరా కొనసాగుతుంది. తమ గ్రామంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని హత్తి బెలగల్ గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా పాలకులకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. వచ్చే వేసవి నాటికైనా వారి కష్టాలు తీరాలని కోరుకుందాం.