విశాఖపట్టణం, ఏప్రిల్ 26,
విశాఖ అంతర్జాతీయ విమానాశ్ర యం కోసం కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 800కోట్ల రూపాయల విలువైన ఈ భూములను తిరిగి స్వాధీనం చేయాలని ఏపీ సర్కారు రాసిన లేఖ కేంద్రం పరిశీలన లో ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న 74ఎకరాలను భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవాలనేది ఆలోచన. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ సుమారు 375 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి రోజు పదుల సంఖ్యలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులు నడుస్తున్నాయి. ఏటి కేడాది ఎయిర్ ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పేరుకి అంతర్జాతీయ విమానాశ్రయమే అయినప్పటికీ అజమాయిషీ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటుంది. నౌకాదళ వాయుస్థావరం ‘ఐ.ఎన్. ఎస్. డేగా’ ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. పైలట్లకు యుద్ధ వి మానాల శిక్షణ ఇక్కడే ఇస్తుంటారు. దేశభద్రత దృష్ట్యా ఈ ఎయిర్ పోర్ట్ అత్యంత కీలకమైనది. రక్షణ, నేవీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఆంక్షలు అమలు చేస్తుంది. ఫలితంగా పౌర విమానాలు రాక పోకలు విస్తృతం అయ్యేందుకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలో భోగాపురం దగ్గర గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం వడివడిగా అడుగులుపడుతున్నాయి.ఆర్కేబీచ్ నుంచి భోగాపురం వరకు రహదారుల విస్తరణకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే త్వరలో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభింకానున్నాయి.ఈ విమానాశ్రయం అందుబాటు లోకి వస్తే దేశీయ,విదేశీ సంస్థలు ఇక్కడ రెక్కలు కట్టుకుని వాలేందుకు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తాయి. తద్వారా ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ కు మరిన్ని విమానాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.నగరం నడిబొడ్డున ఉన్న ఎయిర్ పోర్ట్ అవసరాల కోసం 2002లో అప్పటి ప్రభుత్వం 74 ఎకరాలను కేటాయించింది. ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 800కోట్ల రూపాయలు కాగా అత్యంత ఖరీదైన ఈ భూములను తిరిగి అప్పగించాలనే ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం పంపించింది.భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ మనుగడ లోకి వస్తే…. వైజాగ్ విమానాశ్రయంపై ఒత్తిడి చాలా వరకు తగ్గి పోతుంది. దీనిని ఆధారంగా చే సుకుని భోగాపురం విమానాశ్రయం పూర్తయిన తర్వాత ప్రభుత్వ వాటా కింద వైజాగ్ ఎయిర్ పోర్ట్ పరిధిలోని భూములను తిరిగి స్వాధీనం చెయ్యాలని లేఖ రాసింది. ఈ భూములు అందుబాటులోకి వస్తే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఏరో సిటీ వంటి ప్రతిపాదనలు చర్చల్లో తిరుగుతున్నప్పటికీ నేవీ కార్యకలాపాలు జరిగే చోట ఎంత వరకు సాధ్యం అనేది ఆసక్తికరం. వాస్తవానికి ఒకసారి భూములను కేంద్రానికి ఇచ్చిన తరువాత తిరిగి తీసుకునే ప్రక్రియ సంక్లిష్టమైనది. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు నేపథ్యంలో ఈ వ్యవహారం ఏ విధంగా కొలిక్కి వస్తుందో చూడాలి.