YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విద్యుత్ కోతలతో... కష్టాలు

విద్యుత్ కోతలతో... కష్టాలు

అనంతపురం, ఏప్రిల్ 26,
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏర్పడిన విద్యుత్ సంక్షోభం ఏపీలో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధిలో పరిశ్రమలకు ప్రధానంగా ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. పరిశ్రమలు వారాంతపు సెలవుకు అదనంగా మరో రోజు సెలవు ప్రకటించుకోవాలని, నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలు కూడా తమ అవసరాల్లో 50 శాతం విద్యుత్ మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం అనంతపురం జిల్లాలోని పరిశ్రమలకు పిడుగు లాంటి వార్త అనే చెప్పాలి. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఉన్నదే అరకొర. వాటిలో ప్రధానంగా జిల్లా కేంద్రంలో పారిశ్రామిక వాడ, అలాగే హిందూపురంలోని పారిశ్రామిక వాడ, తాడిపత్రి ప్రాంతంలోని గ్రానైట్ పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమలు, ఇటు రాయదుర్గంలోని జీన్స్ పరిశ్రమలు ప్రధానమైనవి. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పరిశ్రమల నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అనంతపురం జిల్లా కేంద్రంలో సుమారు 53 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ పరిశ్రమలకు పగటి పూట నిరంతరాయంగా ఉంటే కొంత వరకు వర్క్ అవుట్ అవుతుంది. కానీ ఆదివారం సెలవు, సోమవారం పవర్ హాలిడే, మిగిలిన రోజుల్లో 50 శాతం మాత్రమే విద్యుత్ వాడుకోవాలంటే.. అసలు పరిశ్రమలు నడిచే పరిస్థితే కనిపించడం లేదు. నిరంతరాయంగా విద్యుత్ కోతలు ఉన్నా తట్టుకోవచ్చుకానీ.. ఇలా గంటా రెండు గంటలు కోతలు ఉంటే పరిశ్రమలు ముందుకు సాగే పరిస్థితే లేదని అంటున్నారు. రాయదుర్గంలో పెద్దఎత్తున ఉపాధి కల్పించే జీన్స్ ప్యాంట్ల పరిశ్రమ… విద్యుత్ కోతల కారణంగా చతికిలపడిపోతోంది. విద్యుత్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో దుస్తుల తయారీ పరిశ్రమల యజమానులు, వాటిపై ఆధారపడిన కూలీలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇక్కడున్న ఎల్‌జీ టైర్ల పరిశ్రమ, విప్రో, కామధేను స్టీల్స్, పవర్‌గేర్, రోల్‌వెల్, బ్రిటీష్‌ పెయింట్స్, బర్జర్‌ పెయింట్స్, సూర్య పైప్స్, స్టీల్‌ పరిశ్రమలు 19, రసాయన పరిశ్రమలు 9, వస్త్ర తయారీ పరిశ్రమలు 5 ఇలా.. దాదాపు వంద పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 18 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం వీరంతా వారంలో రెండు మూడు రోజులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఇటు రాయదుర్గంలో కూడా జీన్స్ పరిశ్రమపై విద్యుత్ కోతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రాయదుర్గంలో జీన్స్ ప్యాంట్ల తయారీ పరిశ్రమ… కరోనాకు ముందు 12 వేల మంది వరకు ఉపాధి కల్పించేది. నోట్ల రద్దు, కరోనా మహమ్మారి ఈ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీశాయి. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న పరిశ్రమలపై విద్యుత్ కోతలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని పరిశ్రమ యజమానులు అంటున్నారు. దీనిపై ఆధారపడిన కూలీలు సైతం ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమల విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. ప్రస్తుతం 350 పరిశ్రమలు 150 మాత్రమే నడుస్తున్నాయి. కరోనా వల్ల ఈ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో పడిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్లీ విద్యుత్ కోతలు విధించడంతో పరిశ్రమల యజమానులు తీవ్ర నష్టాలు మూటగట్టుకునే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు. Spotఇటు చేనేత పరిశ్రమపైనా ఈ ప్రభావం కొంతవరకు కనిపిస్తోంది. జిల్లాలో విద్యుత్ కోతల వలన పరిశ్రమల యజమానులే కాకుండా కార్మికులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అసలే చాలీచాలని వేతనాలు ఉన్న నేపథ్యంలో ఉన్న కాస్త దాంట్లో కూడా కోతలు పడితే ఎలా బతికేదని కార్మికులు అంటున్నారు.

Related Posts