విజయవాడ, ఏప్రిల్ 26,
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు.. కోర్టు తీర్పులు.. రాజకీయ వ్యూహాల నడుమ అమరావతిలో మరోసారి కదలిక మొదలైంది. ప్రభుత్వ వ్యూహంలో మార్పు కనిపిస్తోంది. ఆకస్మికంగా అమరావతిలో వచ్చిన కదలికతో స్థానిక రైతులు హ్యాపీగా ఫీలవుతున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత అనూహ్యంగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తర మీదకు తెచ్చింది. ఆ వెంటనే నెల రోజులకే శాసన సభ – శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లులను ప్రవేశ పెట్టింది. మండలిలో వివాదం చోటు చేసుకుంది. ఆ తరువాత మూడు రాజధానుల వ్యవహారం – సీఆర్డీఏ రద్దు బిల్లుల వ్యవహారం కోర్టుకు చేరింది. మరోసారి అసెంబ్లీ -మండలిలో బిల్లులను ఆమోదించటం.. గవర్నర్ నోటిఫై చేయటం పూర్తయింది.ఇక, కోర్టులో పెద్ద సంఖ్యలో పిటీషన్లు..సుదీర్ఘ వాదనల తరువాత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఆ సమయంలోనే అనూహ్యంగా మూడు రాజధానులు – సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ఉప సంహరించుకుంది. ఇక, కోర్టు మార్చిలో ఇచ్చిన తీర్పులో అమరావతి కోసం రైతులతో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అసెంబ్లీకి రాజధాని మార్పు నిర్ణయం తీసుకొనే అవకాశం లేదని.. రాష్ట్రపతి ఆమోదంతోనే రాజధాని మార్పు సాధ్యమని తేల్చి చెప్పింది. అదే సమయంలో అమరావతి నిర్మాణాలకు సమయం నిర్దేశించింది. దీని పైన అసెంబ్లీలోనూ చర్చ చేసారు. న్యాయస్థానం నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయలేమని స్పష్టం చేసింది. కోర్టులోనూ అఫిడవిట్ దాఖలు చేసింది.ఆరు నెలలు కాదు.. అరవై నెలలు సమయం కావాలని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఇక, ఇదే సమయంలో రాజకీయంగా జగన్ ప్రభుత్వం 2024 ఎన్నికల కోసం అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇందులో భాగంగానే అమరావతిలో అసంపూర్తిగా మిగిలిన నిర్మాణాల పూర్తి దిశగా కార్యాచరణ మొదలైంది. అందులో భాగంగా..రాయపూడిలో తుదిదశలో ఉన్న భవన నిర్మాణ పనులు చేపట్టాలని కాంట్రాక్టు సంస్థను సీఆర్‌డీఏ కోరినట్టు తెలిసింది. గతంలో ఈ భవనాలను నిర్మించిన ఎన్‌సీసీ సిబ్బంది పనులు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్‌లో ఒక్కోదానిలో 6 చొప్పున అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు టైల్స్, మార్బుల్స్ పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరుగుతున్న పనుల ను అమరావతి రైతులు, దళిత, ముస్లింమైనార్టీ నేతలు పరిశీలించారు. లారీల్లో నుంచి మెటీరియల్‌ను దించుతున్న కార్మికులకు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు.తమకు ఇవ్వాల్సిన ఫ్లాట్లను కూడా త్వరగా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి అప్పగించాలని కోరుతున్నారు. మరింతమంది కార్మికులు రాయపూడి చేరుకుంటారని, వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది. వచ్చే ఎన్నికల నాటికి ఏ ప్రాంతంలోనూ వ్యతిరేక లేకుండా.. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చూడాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉండటంతో పాటుగా..అమరావతితో రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లను కూడా త్వరగా అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో.. పాటుగా అమరావతి ప్రాంతంలో అభివృద్ధి ప్రణాళికలు ఖరారు చేయటం ద్వారా అక్కడ రాజకీయంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో న్యాయ పరమైన అంశాలను పరిశీలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం కూడా కీలకం కానుంది. అయితే, అమరావతిలో తిరిగి పనులు ప్రారంభం కావటంతో..ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది.