YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లగడపాటి భేటీతో సామాజిక వర్గాల చర్చ

లగడపాటి భేటీతో సామాజిక వర్గాల చర్చ

విజయవాడ, ఏప్రిల్ 26,
ఆంధ్రా ఆక్టోపస్’, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే వారి భేటీ పలు అనుమానాలకు కూడా అవకాశం ఇస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు కాకుండా ఉండాలని అప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న లగడపాటి సమైక్య నినాదాన్ని బలంగా వినిపించారు. రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పినట్లే ఆయన చాన్నాళ్లుగా రాజకీయంగా కనుమరుగయ్యారు. అయితే.. శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ జిల్లా నందిగామ, చందర్లపాడులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి లగడపాటి హాజరయ్యారు. అక్కడితో ఆగకుండా వసంత కృష్ణప్రసాద్ తో భేటీ అయ్యారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజవర్గాల్తోని కాంగ్రెస్, వైసీపీ నేతలతో కూడా సమావేశమయ్యారు. రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రెండు రోజుల పాటు ఇలా హల్ చల్ చేయడాన్ని పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు.ఏపీ సీఎం కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన రెండో కేబినెట్ లో సామాజిక సమీకరణలో భాగంగా అయినా వసంత కృష్ణప్రసాద్ కు స్థానం కల్పించి ఉండాల్సింది. తొలి కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించిన కమ్మ సామాజికవర్గానికే చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి పొడిగింపు ఇవ్వలేదు. కొడాలి నానికి పొడిగింపు ఉందడనే విషయం ముందుగానే లీకులు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో రెండో కేబినెట్ లో సామాజిక సమీకరణలో భాగంగా తనకు బెర్త్ కోసం కృష్ణప్రసాద్ బాగా ఆశలు పెంచుకున్నారు. అయితే.. ఆయనకు మొండిచెయ్యి చూపించారు సీఎం జగన్. అప్పటి నుంచీ కృష్ణప్రసాద్ అసహనానికి, ఆవేదనకు గురయ్యారనే వార్త వచ్చాయి. అసలే వైసీపీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్న వసంత కృష్ణప్రసాద్ తో అదే సామాజికవర్గానికి చెందిన లగడపాటి రాజగోపాల్ భేటీ కావడం, ప్రత్యేకంగా ఇద్దరూ చర్చించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.2019 నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాజగోపాల్ మళ్లీ చైతన్యవంతం అవుతారా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. లేదంటే తన కుమారుడు అశ్రిత్ చేత పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు పావులు కదుపుతున్నారా? అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. లగడపాటి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే... విజయవాడ లోక్ సభా స్థానం నుంచి తాను బరిలో దిగి, తన కుమారుడి చేత ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే వ్యూహం ఏదో పన్నుతున్నారని, ఆ క్రమంలోనే వసంత కృష్ణప్రసాద్ తో పాటు కాంగ్రెస్, వైసీపీ రాజకీయ నేతలతో చర్చలు జరిపారంటున్నారు. విజయవాడ టీడీపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న దేవినేని ఉమకు గట్టి ప్రత్యర్థి అయిన వసంత కృష్ణ ప్రసాద్ తో లగడపాటి భేటీ దేనికి దారితీస్తుందనే చర్చ నడుస్తోంది.రాజగోపాల్ మళ్లీ యాక్టివ్ అవ్వాలని, అందుకు పొలిటికల్ ప్లాట్ఫాం కోసం వసంత కృష్ణప్రసాద్ ద్వారా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు యత్నించే క్రమంలోనే ఈ సమావేశం జరిగిందని కొందరు అంచనా వేస్తున్నారు. మంత్రి పదవి దక్కలేదనే బాధలో ఉన్న కృష్ణప్రసాద్ ను వైసీపీ అధిష్టానంపై ఉసిగొల్పే రాజకీయ ప్రయత్నానికేమైనా తెర లేపారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతుండడం గమనార్హం. లగడపాటి- వసంత కృష్ణప్రసాద్ మధ్య సాన్నిహిత్యం ఉంది. దాంతో పాటు వారి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయని అంటారు. ఈ క్రమంలో వసంత కృష్ణ ప్రసాద్ కు మద్దతుగా నిలవడం, ఆయన భవిష్యత్ వ్యూహ రచనకు తోడ్పాటు అందించడానికి కూడా లగడపాటి భేటీ అయ్యారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఒకవేళ లగడపాటి వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు వెంటనే ఓకే చెబుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే విజయవాడలో గత రెండు లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున కేశినేని నాని గెలిచారు. అయితే.. ఇప్పుడాయన టీడీపీతో కాస్త అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటున్నారు. కేశినేనిపై 2019లొ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన పొట్లూరి వరప్రసాద్ ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో విజయవాడ స్థానంలో అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి కూడా వ్యాక్యూమ్ ఉంది. ఈ సమయంలో లగడపాటి వస్తానంటే నేనొద్దంటానా? అని వైఎస్ జగన్ అంటారంటున్నారు.ఏదేమైనా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, లగడపాటి రాజగోపాల్ సమావేశం ఇప్పుడు రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలకు, అంచనాలకు, అనుమానాలకు అవకాశం ఇచ్చింది.

Related Posts