నల్గోండ ఏప్రిల్ 26,
యాదాద్రి పేరు మళ్లీ యాదగిరి గుట్టగా మారిందా? అలా కేసీఆరే మార్చేశారా? మళ్లీ పాత పేరుతోనే పిలవనున్నారా? చినజీయర్ స్వామి పెట్టినందుకే యాదాద్రి పేరు వినిపించకుండా చేస్తున్నారా? యాదాద్రి మాదిరే త్వరలో భద్రాద్రి పేరు కూడా మార్చేస్తారా? అంటే అవుననే అంటున్నారు. అఫీషియల్‌గా యాదాద్రి పేరు మార్చినట్టు ఇంకా ప్రకటన రాకపోయినా.. తాజాగా సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారంలో యాదగిరిగుట్టు అంటూనే వివరాలు రిలీజ్ చేశారు. ప్రెస్‌నోట్‌లో సైతం యాదగిరిగుట్ట అనే ఉండటం ఆసక్తికరంగా మారింది. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మార్చేయనున్నారని తెలుస్తోంది. అందుకే, ఇన్నాళ్లుగా లేనిది.. ఇప్పుడు కొత్తగా యాదగిరిగుట్ట పేరుతో ముఖ్యమంత్రి పర్యటన సమాచారం ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మార్చడానికి చినజీయర్ కేసీఆర్ మధ్య విభేదాలే కారణమని అంటున్నారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతానికి యాదగిరిగుట్ట అనే పేరు. తెలంగాణ వాసులంతా అలానే పిలుస్తారు. యాదాద్రి అనే పేరు ఇంకా అలవాటు కూడా కాలేదు. చినజీయర్ చెప్పారనే ఏళ్లుగా ఉన్న యాదగిరిగుట్టకు యాదాద్రి అని పేరు పెట్టారు. అలాగే భద్రాచలంను కూడా భద్రాద్రి అని నామకరణం చేసింది కూడా చినజీయరే. ఇన్నాళ్లూ ఆయనతో సీఎం కేసీఆర్ సఖ్యతగా ఉండటంతో కొత్త పేర్లు ఫిక్స్ అయ్యాయి. కానీ, ఇటీవల జీయర్ స్వామిని కేసీఆర్ పక్కనపెట్టేశారు. సమతామూర్తి విగ్రహ సమారోహనం ఎపిసోడ్‌లో కేసీఆర్ ఇగో హర్ట్ అయింది. అప్పటినుంచీ చినజీయర్‌ను హర్ట్ చేస్తున్నారు. ఆయన లేకుండానే యాదాద్రి ఆలయ పునరుజ్జీవ కార్యక్రమం జరిగిపోయింది. ఇప్పుడు చినజీయర్ పెట్టిన యాదాద్రి పేరును కూడా మార్చేసి.. మళ్లీ పాత పేరైన యాదగిరి గుట్టగానే ఉంచేయాలని భావిస్తున్నారు. స్థానికులు సైతం యాదాద్రి అంటే అదోలా ఉంది.. యాదగిరిగుట్ట అంటేనే మంచిగుంది అంటున్నారు. ఇక, చినజీయర్ పెట్టిన భద్రాద్రి పేరును కూడా మళ్లీ భద్రాచలం ఆలయంగా మార్చేసే ఆస్కారం ఉందంటున్నారు.