హైదరాబాద్, ఏప్రిల్ 26,
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేబినెట్ పునర్వ్యవస్థీరణ దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నాటికి సరికొత్త టీమ్ తో సిద్ధం అవ్వాలని భావిస్తున్నారా? ఏరి కోరి తాను తెచ్చుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా అదే చెప్పారా? ఇప్పుడు తెరాస వర్గాలలో విస్తృతంగా నడుస్తున్న చర్చ అదే. రెండు దఫాలుగా అంటు 2014, 2018 ఎన్నికలలో విజయం తరువాత ఆయన కేబినెట్ లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవనే చెప్పాలి. అయితే ఇప్పుడు మూడో సారి ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేస్తున్న నేపథ్యంలో టీమ్ ను మార్చుకోవాలని, వీలైతే పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి అవసరం ఉందనీ ప్రశాంత్ కిశోర్ ఆయనకు సూచించనట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. పీకే టీమ్ జరిపిన రహస్య సర్వేలలో పలువురు మంత్రులపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నట్లు తేలందని చెబుతున్నారు. సర్వేల వ్యవహారం పక్కన పెడితే ఇటీవలి కాలంలో పలువురు మంత్రులు వివాదాలలో ఇరుక్కుని ప్రతిష్టను మసకబార్చుకోవడం, ఆ ప్రభావం ప్రభుత్వంపై కూడా పడుతుందన్న భావనలో ఉన్న కేసీఆర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఇదే తరుణమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై తనకు సన్నిహితులతో ఒక దఫా చర్చించినట్లు కూడా చెబుతున్నారు. తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న కేబినెట్ మంత్రులకు ఉద్వాసన పలికి....వారి స్థానంలో ఉత్సాహంగా పని చేసే యువకులను నియమంచాలని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు.
ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంటలు సృష్టించిన నేపథ్యంలో తెలంగాణలో కేబినెట్ లో మార్పులు, చేర్పులూ అనగానే సహజంగానే అందరిలో ఉత్కంఠ, ఆసక్తి నెలకన్నాయి. ఎన్నికల ముంగిట కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కేసీఆర్ కసరత్తుకు కారణం ఈ కేబినెట్ టీమ్ తో ఎన్నకలకు వెళితే నష్టం ఉంటుందన్న భావనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత కేబినెట్ లోని కొందరు మంత్రులపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. వివాదాలలో ఇరుక్కున్న వారూ ఉన్నారు. వారి పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలలో తేలంది. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకునే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనివార్యమని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వివాదాల మంత్రుల కారణంగా పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నదనీ, అటువంటి వారిని ఇంకా మంత్రులుగా కొనసాగిస్తే అది ఎన్నికలలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.