హైదరాబాద్, ఏప్రిల్ 26,
మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్ శర్మణ్ ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. గతకొద్ది రోజులుగా ఈ అంశం ఓ వైపు అధికారుల్లో, మరోవైపు రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వంలోనూ, ప్రజలలోనూ సౌమ్యుడైన, సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందిన ఆయన జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం గతకొన్ని రోజులుగా జరుగుతోంది. గ్రూప్ -1 అధికారిగా ప్రభుత్వ సర్వీసుల్లో చేరి ఐఏఎస్‌గా కన్ఫార్మ్ అయ్యే వరకు, అయిన తర్వాత కూడా ఎన్నో పదవుల్లో పనిచేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా, జీహెచ్ఎంసీ అదనపు కార్యదర్శిగా, మహబూబ్ నగర్ జాయింట్ కలెక్టర్‌గా ఆయన గతంలో పనిచేశారు. ఎక్కడ పని చేసినా ఆయన తనదైన ముద్ర వేశారు. ఐఏఎస్ అనే గర్వం ఆయనలో కనబడదు. ఆయన మంచితనమే రాజకీయాల్లోకి రావాలనుకునే వారిసంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుండి కలెక్టర్ ఎల్ శర్మణ్ ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన పుట్టి పెరిగింది జిన్నారం. ఈ నియోజకవర్గం మొత్తం మూడు జిల్లాల పరిధిలోకి వస్తోంది. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తూరాబాద్ మండలాలు నిర్మల్ జిల్లా, ఉట్నూర్, ఇంద్రవల్లి ఆదిలాబాద్ జిల్లా, జిన్నారం మంచిర్యాల జిల్లా పరిధిలోకి వస్తాయి. కాగా, ఖానాపూర్ నియోజకవర్గం నుండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా రేఖానాయక్ ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికే చెందిన కలెక్టర్ శర్మణ్‌కు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు, పట్టు ఉంది. అంతేకాకుండా గోండులు, లంబాడాల ఓట్లు కూడా అధికంగా ఉండడం, స్థానిక సమస్యలపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండడంతో ఆయన ఖానాపూర్ నుండి ఎన్నికల బరిలోకి దిగుతారని తెలిసిందిజూన్‌లో పదవీ విరమణ అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రత్యక్ష్య రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2023లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అంటే కలెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం ఎన్నికలకు సుమారు ఏడాది సమయం ఆయనకు ఉంటుంది. ఈ సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలనే భావనతో ఉన్నారని సమాచారం. అయితే, కలెక్టర్ శర్మణ్ మాత్రం టీఆర్ఎస్ టిక్కెట్‌తో ఖానాపూర్ నుండి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.ఎస్టీ సామాజికవ వర్గం నుండి వచ్చినప్పటికీ కలెక్టర్ స్థాయికి ఎదిగిన శర్మణ్ రాజకీయాల్లో వస్తే దాని ప్రభావం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఇతర నియోజకవర్గాలపై పడే అవకాశమూ లేకపోలేదు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ప్రజలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇదే ఆయన రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపిస్తోంది.