తిరుపతి
తిరుపతి కరకంబాడీ రోడ్డులో నాలుగు ఎర్రచందనం దుంగలతో పాటు ఒక స్మగ్లర్ ను అరెస్టు చేయగా,కడప జిల్లా బద్వేలు రేంజి లో తొమ్మిది ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు, డీఎస్పీ మురళీధర్ నాయకత్వం లో ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన రెండు టీమ్ లు మంగళవారం ఉదయం 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒక టీమ్ తిరుపతి రేంజ్ లోని కృష్ణా పురం సెక్షన్ కరకంబాడీ బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో దుంగలు మోసుకుని వస్తున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టారు. దీంతో వారు దుంగలు పడేసి పారి పోతుండగా తమిళనాడు తిరువన్నామలై జిల్లా పెరునత్తం గ్రామానికి చెందిన అన్నామలై (50)ను పట్టుకుని అరెస్టు చేశారు. అదేవిధంగా ఇంకో టీమ్ కడపజిల్లా పొద్దుటూరు డివిజన్ బద్వేలు రేంజ్ లో చెన్నారం గ్రామ సమీపంలోని అడవుల్లో కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళ్తుండగా, పోలీసులను చూసి పారిపోయారు. అక్కడ తొమ్మిది ఎర్రచందనం దుంగలు లభించాయి. 13 దుంగలు 273 కిలోలు ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ సిఐ, ఎస్ ఐ లు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.