హైదరాబాద్, ఏప్రిల్ 26,
తెలంగాణ గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్‌కు ఈటల రాజేందరే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం వేయిస్తంభాల ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికల కోసం ఓ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే గవర్నర్‌పై కేసీఆర్‌కు కోపం వచ్చిందన్నారు. అందుకే గవర్నర్‌ను తరచూ అవమానిస్తున్నారని అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు గవర్నర్ వస్తే కలెక్టర్, ఎస్పీ లేకపోవడం అవమానకరం కాదా అన్ని ప్రశ్నించారు. అయితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు దశల వారీగా వస్తాయన్నారు. తెలంగాణలో ఫీజు రియంబర్స్ మెంట్ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు.టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేసీఆర్, కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందన్నారు. బీజేపీని తిట్టాలని టీఆర్ఎస్ అధిష్టానం ప్రోత్సహిస్తోంది.. అందేకే వారి మెప్పుకోసం టీఆర్ఎస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భారత ప్రభుత్వం వరంగల్‌ను హెరిటేజ్ సిటీగా ప్రకటించిందని తెలిపారు. రామప్పకు మొదటిసారి విఫలమైనా రెండోసారి ప్రయత్నించి యునెస్కో గుర్తింపు తీసుకువచ్చామని చెప్పారు. వేయిస్థంబాల దేవాలయం కళ్యాణ మండపం గురించి ప్రధాని నరేంద్రమోదీకి చెప్పామన్నారు. రామప్పకు మూడు కోట్ల 70లక్షలు ఖర్చు చేస్తున్నామని, టూరిజం ప్రసాద్ స్కీమ్ క్రింద రూ.50 కోట్లతో సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.భద్రాచలం టెంపుల్‌ను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. డీపీఆర్ వచ్చిన తర్వాత పనులు చేపడుతామని తెలిపారు. ములుగులో ట్రైబల్ సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.