చెన్నై, ఏప్రిల్ 26,
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్ల నియామకంలో రాష్ట్ర గవర్నర్‌కు ఉన్న అధికారాలను తొలగించేలా స్టాలిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో యూనివర్సిటీల వీసీలను ప్రభుత్వమే నియమించేలా చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ మేరకు తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి సోమవారం నాడు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును అన్నాడీఎంకే, బీజేపీ వ్యతిరేకించగా.. పీఎంకే పార్టీ సమర్థించింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్ వైస్ ఛాన్సిలర్లను నియమించాలని.. అయితే అది తమ ప్రత్యేక హక్కు అన్నట్లుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రభుత్వాన్ని అగౌరవపర్చడమేకాక ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధమని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. వీసీల నియామకాల్లో ప్రభుత్వానికి అధికారం లేకపోవడం అనేది ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 2010లో మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మదన్ మోహన్ పూంఛీ నేతృత్వంలో కమిషన్‌కు ఇచ్చిన నివేదికను స్టాలిన్ ప్రస్తావించారు. వీసీల నియామక ప్రక్రియ నుంచి గవర్నర్‌ను తొలగించాలని సదరు కమిటీ సిఫారసు చేసినట్లు ఆయన గుర్తుచేశారు.