విజయవాడ, ఏప్రిల్ 27,
చెరకు సాగు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతు న్నాయి. దుక్కులు, ఎరువులు, చెరకు రవాణా తదితరాలకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. 2017-18 సీజన్లో ఎకరా చెరకు మొక్కతోట సాగుకు రూ.85 వేలు పెట్టుబడికాగా, 2022-23 సీజన్లో అది రూ.1.25 లక్షలకు చేరుకుంది. కౌలు భారం దీనికి అదనం. దీంతో గిట్టుబాటు కాని పరిస్థితుల్లో రైతులు, కౌలురైతులు చెరకు సాగుపై విముఖత చూపుతున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే కృష్ణాజిల్లా ఉయ్యూరు కెసిపి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఈ సీజన్లో అత్యల్పంగా చెరకు సాగైంది ఉయ్యూరు కెసిపి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం టన్ను చెరకుకు రూ.2,850 రైతుకు చెల్లిస్తోంది. మొక్కతోట సాగుకు ఎకరానికి మరో రూ.20 వేలు ప్రోత్సాహం ఇస్తోంది. మొత్తం కలిపి సగటున టన్నుకు రూ.3,050 అందుతోంది. ఈ క్రషింగ్ సీజన్లో సగటున ఎకరానికి 32.4 టన్నుల దిగుబడి మాత్రమే రాగా రైతుకు ప్రోత్సాహకాలతో కలిపి రూ.98,820 మాత్రమే ఆదాయం వచ్చింది. పెట్టిన పెట్టుబడికన్నా ఎకరానికి రూ.26,180 వరకు నష్టం వాటిల్లింది. కృష్ణాజిల్లాలో కౌలు రైతులే అత్యధిక విస్తీర్ణంలో చెరకు సాగు చేస్తున్నారు. ఎకరానికి సగటున 15 టన్నుల చొప్పున భూ యజమానికి కౌలు చెల్లిస్తున్నారు. మిగిలిన 17.4 టన్నులకు రూ.53,070 మాత్రమే కౌలు రైతులకు ఆదాయం వచ్చింది. పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఎకరానికి రూ.71,930 అప్పు మిగులుతోంది. మొదటి ఏడాది మొక్క తోటకు పెట్టుబడి వ్యయం ఎక్కువైనా రెండో ఏడాది నామమాత్రంగానే వ్యయం అవుతుంది. పిలకను సంరక్షించుకోవడం ద్వారా కొంత మేరకు ఆదాయం తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో రెండేళ్లుగా ఎలుకల బెడద తీవ్రతరమైంది. ఎకరానికి రూ.10 వేలు ఖర్చు చేసినా వాటి నివారణ సాధ్యం కావడంలేదు. దీంతో పిలక తోటలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉయ్యూరు ఫాక్టరీ పరిధిలోని పమిడిముక్కల మండలంలో ఏటా సగటున వెయ్యి ఎకరాలు చెరకు సాగవుతుండగా, ఈ సీజన్లో కేవలం 200 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఉయ్యూరు మండలం గండిగుంటలో ఏటా 150 ఎకరాల విస్తీర్ణంలో చెరకు సాగవుతుండగా, ఈ ఏడాది కేవలం పది ఎకరాలకు పరిమితమైంది.రాష్ట్రవ్యాప్తంగా ఒకప్పుడు 29 షుగర్ ఫ్యాక్టరీల పరిధిలో చెరకు సాగయ్యేది. ఇప్పుడు ఐదు ఫ్యాక్టరీలు మాత్రమే మిగిలాయి. కృష్ణాజిల్లాలో ఉయ్యూరు, చల్లపల్లి (లక్ష్మీపురం), హనుమాన్ జంక్షన్ షుగర్ ఫ్యాక్టరీలు ఉయ్యూరు కెసిపి నిర్వహణలో ఉంది. ఏటా ఎనిమిది వేల టన్నుల క్రషింగ్ చేసే ఈ ఫ్యాక్టరీకి సైతం తగినంత విస్తీర్ణంలో చెరకు సాగవ్వడం లేదు.