విజయవాడ, ఏప్రిల్ 27,
ఆంధ్రప్రదేశ్ లో అందరి పరిస్థితీ ఆగమాగమే! ఎవరికీ ఉద్యోగ భద్రత లేదు. ఉద్యో్గమున్న వేతనం సమయానికి వస్తుందన్న భరోసా లేదు. పేదలకు రేషన్ ఏ నెలకా నెల అందుతుందన్న ధీమా లేదు. ఈ నెల రేషన్ కోత ఇప్పటికే చెబుతున్నారు. ఇలా జగన్ సర్కార్ తన ఆర్థిక అవకతవకల కారణంగా అన్ని వర్గాలనూ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. మత్స్య వర్సిటీ సిబ్బంది అయితే రెండు నెలలుగా వేతనాలు లేక నానా ఇబ్బందులూ పడుతున్నారు. సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని నడిపేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలందకుంటే ఎలారా బాబూ అని ఆవేదన చెందుతున్నారు.వర్సిటీలో యూజీసీ స్కేళ్ల ప్రకారం వేతనాలు అందుకునే వారి పరిస్థితి బానే ఉంది. అయితే మిగిలిన మినిస్టీరియల్ సిబ్బంది పరిస్థితే దయనీయంగా ఉంది. వారికి ఇప్పటికీ మార్చి వేతనాలు అందలేదు. ఏప్రిల్ నెల చివరికి వచ్చేసింది. ఇంకా మొదటి ఏప్రిల్ మొదటి తారీకుల అందాల్సిన జీతాలకు అతీగతీ లేదు. ఎందుకు ఆలస్యం అయ్యింది, ఎప్పుడిస్తారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే నాథుడే లేడు.వీరి జీతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్ కేటాయిస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితి కారణంగా చెప్పి గత నెల వేతనాలకు ఇంత వరకూ ఆమోద ముద్ర వేయలేదు. వేతనాలు ఇవ్వకపోవడానికి అదే కారణమని చెబుతున్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల విషయంలో పెద్ద పట్టింపు చూపుతున్నట్లుగా తోచదు. ఇప్పటికే హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీలకు గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ ను తగ్గించింది. ఉద్యాన వర్సిటీకి రూ.10 కోట్లు, వెటర్నర వర్సిటీకీ రూ.15 కోటు చొప్పున తగ్గించింది. ఇక ప్రభుత్వం ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామంటూ ఘనంగా ప్రకటించిన మత్స్య వర్సిటీకి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించలేదు. అంటే ఆ వర్సిటీ తరగతుల ప్రారంభం ఈ ఏడాది హుళక్కే అని అర్ధమౌతున్నది. కేటాయింపుల్లో కోతలు, వేతనాలకు ఆమోదముద్ర వేయకుండా వర్సిటీల సిబ్బందిని ఇబ్బందుల పాలు చేస్తున్నది. వెంటనే వేతనాలు విడుదల చేయకుంటే ఆందోళన బాటపడతామని సిబ్బంది హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు అంటున్నారు.