అనంతపురం, ఏప్రిల్ 27,
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలతో జనం అల్లాడుతుంటే...ప్రభుత్వం మాత్రం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం, ట్రాన్స్ కో అద్భుతంగా పని చేస్తున్నదంటూ గప్పాలు కొడుతోంది. వాస్తవానికి మండు వేసవిలో విద్యుత్ కోతలతో జనం అల్లాడి పోతున్నారు. విద్యుత్ కోతలు ఒక్క గృహావసరాలకే పరిమితం కాలేదు. అన్ని రంగాలకూ విస్తరించాయి. వ్యవసాయానికి కోత, పరిశ్రమలకు కోత...ఇలా ఏపీలో జగన్ సర్కార్ కోతల సర్కార్ గా మారిపోయింది. జనం అవస్థలను పట్టించుకోకుండా కోతల సర్కార్ లో కొందరు కోతల రాయుళ్లు దర్బార్ లు పెట్టి మరీ విద్యుత్ సరఫరా భేష్ అంటూ సొంత భుజాలను తట్టుకుంటున్నారు. ఈ కోతల రాయుళ్ల మాటలు వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి ఏపీలో న గరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఎప్పుడుంటుందో, ఎప్పుడుండదో రైతులకే కాదు విద్యుత్ అధికారులకే తెలియని పరిస్థితి ఉందంటే అతి శయోక్తి కాదు. ఇక పరిశ్రమల విషయానికి వస్తే ఏకంగా వారానికి ఒక రోజు పవర్ హాలీడే ప్రకటించేశారు. మిగిలిన రోజులైనా సక్రమంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందా? అంటే ఆ గ్యారంటీ లేదు. రాష్ట్రంలో విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే...నాణ్యమైన విద్యుత్ అంటూ మంత్రి పెద్దిరెడ్డిగారు ట్రాన్స్ కోను పొగిడేస్తున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నదంటూ సర్కార్ కు భుజకీర్తులు తగిలించేస్తున్నారు. ఆయన మాటలు కోటలు దాటుతున్నాయనీ, ప్రభుత్వ చేతలు మాత్రం గడప దాటుతున్న పరిస్థితి కనిపించడం లేదనీ విద్యుత్ రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలా ప్రదాన నగరాలతో పాటు పట్టణాలూ పల్లెల్లో విద్యుత్ కోతలు మండు వేసవిలో మంటలు రేపుతున్నాయి. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అంటూ సర్కార్ వేస్తున్న ఈ కోతల వాతల వల్ల జనం అల్లాడుతున్నారు. మండు వేసవిలో జనాల పరిస్థితి మగ్గపెట్టిన మామిడి పళ్లలా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతల వళ్ల జనం నరకయాతన పడుతుంటే మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా భేషుగ్గా ఉందంటూ సర్కర్ పని తీరుకు కితాబులిచ్చేస్తున్నారు. గణాకాంలు కాదు సారూ...వాస్తవాలు చెప్పండంటూ జనం నిలదీస్తున్నారు. విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్ లో అందకారం తాండవిస్తోంది. పరిశ్రమలు మూతపడ్డాయి. వేల మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే....సర్కార్ మాటలు మరోలా ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి