గుంటూరు, ఏప్రిల్ 27,
మామూలుగా మౌనం అర్ధాంగీకారం.. అయితే కాంగ్రెస్ తో పొత్తు విషయంలో వైసీపీ అధినేత జగన్ మౌనంపై మాత్రం బీజేపీ రగిలిపోతోంది. ఆ మౌనం సంపూర్ణాంగీకారమే అని చిర్రుబుర్రులాడుతోంది. రాష్ట్రంలో బలమైన పార్టీని కాదనుకుని 2019 ఎన్నికలలో బీజేపీ పొత్తు లేకపోయినా అన్నిందాలా మద్దతు ఇచ్చిన సంగతిని గుర్తు చేసుకుని రగిలిపోతున్నది. అంతే కాకుండా అధికారంలో ఉన్న ఈ మూడేళ్లు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన ఆర్థిక అవకతవకలను సమర్ధిస్తూనో, లేదా చూసీ చూడనట్లు వదిలేసో సహకరించిన కమల నాథులకు ఇప్పుడు వైకాపా రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్త పెట్టుకోవడం మింగుడుపడటం లేదు. ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనలపై వైసీపీ నుంచి ఎటుంటి సానుకూల స్పందనా ఇప్పటి వరకూ రాకపోయినా, ఎలాంటి వ్యతిరేక ప్రకటన కూడా చేయకుండా జగన్ పాటిస్తున్న వ్యూహాత్మక మౌనంపై బీజేపీ గుర్రుగా ఉంది.ఆ కారణంగానే ఇప్పటి వరకూ ఈ మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలపై ఓ కన్నేసుంచాలని నిర్ణయించుకుంది. అంతే కాకుండా నిబంధనలను కాదని ఒక్కరూపాయి కూడా అప్పు పట్టకుండా చక్రబంధంలో బిగించేసింది. బీజేపీలోని ఒక వర్గం కథనం ప్రకారం జగన్ కు రాజకీయ ప్రయోజనలంటూ ఏమీ ఉండవనీ, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతుగా ఉంటూ తన కేసుల నుంచి తప్పించుకోవడమే ప్రధాన లక్ష్యం. అందుకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికలలో అధికారం చేపట్టనున్నది కాంగ్రెస్ అని నమ్మబలుకుతుండటంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని బీజేపీ భావిస్తున్నది.ఇంత కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అంటకాగి, ఇప్పడు కాంగ్రెస్ తో పొత్తు విషయంలో వ్యూహాత్మక మౌనం పాటించడమంటే.. కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ సర్కార్ అన్న సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వడమేనని బీజేపీ భావిస్తున్నది. జగన్ కు ఇంత కాలం అండగా నిలిచిన కమలం.. అందుకు ప్రతిఫలంగా రాష్ట్రంలో ఏదో ఒక మేర బలోపేతం కావాలని భావిస్తున్నది. మరో సారి కేంద్రంలో మోడీ సర్కార్ అధికార పగ్గాలు చేపడుతుందన్న నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలలో కలిగించగలిగితేనే అది సాధ్యమౌతుంది. ఇంత కాలం అనధికార మిత్ర పక్షంగా ఉన్న వైసీపీ పక్క చూపులు చూస్తే జనం కేంద్రంలో బీజేపీ పనై పోయిందనీ, అందుకే జగన్ పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తోందన్న నిర్ధారణకు వచ్చేస్తారు. అంతే కాదు ఈ ప్రభావం దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాలపై పడే అవకాశం ఉంది. ఎందు కంటే జగన్ కు రాజకీయాలు, అధికారం తనపై ఉన్న కేసుల భయం లేకుండా ఒక కవచంలా వాడుకునేందుకేనని తెలియని వారెవరూ లేరు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతుగా నిలవకుంటే ఇబ్బందులు తప్పవని తెలిసిన స్థిత ప్రజ్ణత జగన్ ఉంది కనుకే ఆయన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదని తెలసినా బీజేపీకి మద్దతుగా నిలబడ్డారు. రైతులలో వ్యతిరేకత పెల్లుబుకుతుందని తెలసీ...వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు కేంద్రం కోరడమే తరువాయ ఆమోదం తెలిపేశారు. రైతు లోకం అంతా వ్యతిరేకిస్తోందని తెలిసీ వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికారు. అటువంటి జగన్ ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు అన్న ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనను వ్యతిరేకించకుండా మౌనంగా ఉండటం, విజయసాయి వంటి నాయకులు పొత్తుకు జగన్ సానుకూలం అనే అర్ధం వచ్చేలా మాట్లాడటం చూస్తుంటే.. కాంగ్రెస్ తో పొత్తు విషయంలో జగన్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు అవగతమౌతుంది. అదే ఇప్పుడు బీజేపీ గుర్రుకు కారణం అని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఇక ముందు కేంద్రంలోని మోడీ సర్కార్ జగన్ సర్కర్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.