విజయవాడ, ఏప్రిల్ 27,
కల్లు మానండోయ్ కళ్లు తెరవండోయ్ అని గాంధీజీ ఇచ్చిన పిలుపు స్వతంత్ర భారతావనిలో అమలు కావడం సాధ్యం కాదు. మద్యం ధరలు పెంచినంత మాత్రాన వినియోగం తగ్గుతుంది అని అనుకోవడమే అవివేకం. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు అవలంభిస్తున్న పద్ధతుల కారణంగా మద్యం ధరలు వినియోగదారులకు అందుబాటులో లేక చుక్కలు చూపిస్తున్నాయి. ఇదే సమయాన నాటు సారా విక్రేతలకూ, తయారీ దారులకూ పల్లెల్లో మరియూ పట్టణాల్లో విపరీతం అయిన డిమాండ్ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే పక్కనే ఉన్న ఒడిశా నుంచి హాయిగా అడ్డదారుల్లో నాటు సారా వచ్చేస్తోంది. ఇంకా గంజాయి సాగు మరియు రవాణా కూడా సరిహద్దు ప్రాంతాలలో యథేచ్ఛగా సాగిపోతోంది.ఇవన్నీ మానుకోవాలని, బుద్ధిగా నడుచుకోవాలని పోలీసులు చేపడుతున్న కౌన్సిలింగ్ డ్రైవ్ ఏదీ కూడా సత్ఫలితాలు ఇవ్వడం లేదు.మద్యపాన నిషేధం అంటే ధరలు పెంచడం కాదు. మద్య పాన నిషేధం అన్నది ఏ సర్కారుకూ సాధ్యం కానే కాదు. మద్య పాన నిషేధం అన్నది ఓ చిన్న మాట కాదు చెప్పి వెళ్లేందుకు.. మన పాలకుల భాషలో చెప్పాలంటే అదొక నిరంతర ప్రక్రియ. సులువు కాని వాటి గురించి మాట్లాడడం తప్పు. సాధ్యం కాని వాటి గురించి ఎందుకని హామీలు ఇచ్చి ఈ నాయకులు తమ పరువు పోగొట్టుకుంటారో మరి! ఇదే విషయమై కమ్యూనిస్టులు గగ్గోలు పెడుతున్నారు. సారా ప్రవాహాలు ఆపడం సాధ్యం కావడం లేదు.మందు ప్రియంగానే ఉంది. దీంతో శ్రీకాకుళం జిల్లా సరిహద్దులలో ఒడిశా నుంచి సారా యథేచ్ఛగా వచ్చేస్తుంది. నాటు సారా తయారీని పోలీసులు ఆపలేకపోతున్నారు. తయారీని అడ్డుకుంటే రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. అక్రమ రవాణా అన్నది మూడో కంటికి తెలియకుండా వివిధ జిల్లాలకు చేరడమే కాదు పొరుగు రాష్ట్రాలకూ పోతోంది. దీంతో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ రాధిక అప్రమత్తమై సారా తాగొద్దని తయారీ చేయవద్దని పలాస నియోజకవర్గంలో కాశీబుగ్గ పోలీసు స్టేషను ఆవరణలో పరివర్తన 2.0 పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సారా తాగొద్దని, తయారీ చేయవద్దని పదే పదే విన్నవించారు. సారా తయారీదారులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారుఆమె మాట్లాడుతూ ఉండగా ఓ వ్యక్తి వచ్చి మద్యం ధరలు ఎక్కువగా ఉండడం కారణంగానే తాము సారా తాగుతున్నామని, తాను దీనిని మానుకోలేనని చెప్పేశాడు. ఆ సమయంలో ఆమె ఎంత చెప్పినా అతడు వినలేదు. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ రాష్ట్రంలో మద్యం ధరలు సారాతో పోలిస్తే రెండు మూడు రెట్లు ఉన్నాయని తేలిందని ప్రధాన మీడియాలో వార్తలొచ్చాయి. అంటే సారా ధర వంద రూపాయలు ఉన్న చోట మద్య ధర రెండు వందల రూపాయలు పలుకుతోంది అని కథనాలు వెల్లడి చేస్తున్నాయి. పోనీ తాము ఇంత డబ్బు వెచ్చించినా నాణ్యమైన సరుకు లభిస్తుందా అంటే అదీ లేదు అని వాపోతున్నారు మద్యం ప్రియులు. మద్యం పాలసీల పేరుతో సంస్కరణల పేరుతో ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకుంటుంటే, సామాన్యుల జేబులు మాత్రం గుల్ల అవుతున్నాయని కమ్యూనిస్టు పార్టీలు రోడ్డెక్కుతున్నాయి. పల్లెల్లో ముఖ్యంగా గిరిజన తండాల్లోసారా విక్రయాలను నిలువరించడం ఎవ్వరి తరం కావడం లేదు అని, అందుకు కారణం కూడా మద్యం ధరలే అని, చీప్ లిక్కర్ కూడా చీప్ గా దొరకడం లేదు అని, ధరలు కారణంగానే సారా విక్రేతలకు మళ్లీ మళ్లీ డిమాండ్ వస్తోంది. మొన్నటి సంక్రాంతి పండగ వేళల్లో కూడా నాటు సారా విక్రయాలు బాగా జోరందుకోవడానికి కారణం కూడా ఇదే !