హైదరాబాద్, ఏప్రిల్ 27,
గులాబీ ప్లీనరీ వేళ మరోసారి ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. మొన్నటిదాక ప్లెక్సీ ప్రింటింగ్ కేంద్రాల మీద దాడులు చేసిన జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం వింగ్ ఇప్పుడు సైలెంట్ అయింది. టీఆర్ఎస్ ప్లీనరీ కోసం నగరంలో బ్యానర్లు, ప్లెక్సీలు పెద్ద ఎత్తున వెలిశాయి. అంతేనా ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ మరోసారి సెలవులో వెళ్లడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.2020లో జీవో 68 అమల్లోకి తెచ్చి నగరంలో ఫ్లెక్సీలపై మున్సిపల్ శాఖ నిషేధం విధించింది. కానీ గత అక్టోబర్ లోనూ టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సిటీ అంతటా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు ఫ్లెక్సీలు భారీగా పెట్టారు. దీనిపై జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈవీడీఎం మూడు రోజుల తర్వాత ఆన్ లైన్ లో వచ్చిన ఫిర్యాదులపై పైన్లు వేసి చేతులు దులుపుకుంది. ఇప్పుడు మళ్లీ అదే వివాదం రాజుకుంది. గత ప్లీనరి టైమ్ లో సెలవుల్లోకి వెళ్లిన జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్.. మళ్లీ ఇప్పుడు కూడా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. విశ్వజిత్ కావాలనే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. బల్దియా అధికారుల తీరు.. అధికార పార్టీగా తొత్తుగా మారిందని.. ప్రతిపక్షాలు, సామాన్యులపై మాత్రమే ఈవీడీఎం పనిచేస్తుందా అంటూ మండిపడుతున్నారు.