హైదరాబాద్, ఏప్రిల్ 27,
అంతా అయిపోయింది.. ఇక, కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే తరువాయి.. వరుస ఓటములు చూస్తోన్న హస్తం పార్టీ.. గాడిలో పడుతోంది.. పూర్వ వైభవం వస్తుంది.. అంటూ అనేక విశ్లేషలు వచ్చాయి.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారానికి తెరపడింది… కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి, పార్టీ అధినేత్రి నుంచి సానుకూలత వ్యక్తం అయినా.. చివరకు పార్టీలోకి రావాలంటూ పీకేను సోనియా గాంధీ ఆహ్వానించిన తర్వాత.. ఆ ఆఫర్‌ను తిరస్కరించారు పీకే.. తాను కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ కుండబద్దలు కొట్టేశాడు.. దీంతో, గత కొంత కాలంగా హాట్ టాపిక్‌గా మారిన ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడినట్టు అయ్యింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న పార్టీని.. ప్రశాంత్ కిషోర్ గాడిలో పెడతాడని గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామంతో నిరాశే ఎదురైంది.ఇలా ఈ మధ్య చర్చ మొత్తం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే గురించే జరిగింది.. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పుల కోసం కీలక సూచనలు చేసిన ఆయనను.. పార్టీలో చేర్చుకోవడంపై సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది. కొందరు నేతలు వ్యతిరేకించినా.. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ సోనియా గాంధీ.. పీకేను ఆహ్వానించడం.. ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగిపోయాయి.. అయితే, కాంగ్రెస్ ఆఫర్‌ను పీకే తిరస్కరించడం వెనుక గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహం ఏమైనా పనిచేసిందా? అనే కొత్త చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చిందికాంగ్రెస్ అధిష్టానానికి టచ్‌లోకి వెళ్లకముందే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు పీకే.. రాష్ట్రంలో మరోసారి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాలు అందించేందుకు సిద్ధం అయ్యారు.. అందులో భాగంగా.. సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌తో కలిసి ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులను కూడా పరిశీలించారు. సర్వే కూడా నిర్వహించి కీలక సూచనలు చేశారు. తాము పీకేతో కలిసి పనిచేస్తున్నామంటూ సీఎం కేసీఆర్ కూడా బహిరంగంగా ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కాంగ్రెస్ అధిష్టానంతో పీకే వరుస భేటీల తర్వాత పరిస్థితి మారిపోయినట్టు కనిపించింది.. పీకే కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే చర్చ సాగింది.. అయితే, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీతో వ్యవహారాలు నడపవద్దని.. అన్ని తెంచుకోవాల్సిందేనంటూ హైకమాండ్ పీకేకు షరతులు విధించినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుంది..ఈ మధ్యే హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ కిషోర్.. ప్రగతి భవన్‌లో మకాం వేశారు.. వరుసగా రెండు రోజుల పాటు గులాబీ దళపతి కేసీఆర్‌తో సుదీర్ఘ మంతనాలు నెరిపారు.. ఈ భేటీయే పీకే మనస్సు మార్చిందా? అనే చర్చ సాగుతోంది.. పీకేతో కలిసి నడిచేందుకు పిక్స్ అయిన కేసీఆర్.. కాంగ్రెస్‌లో ఉండే పరిస్థితులు.. అందులో చేరితే ఉండే ఇబ్బందులు.. ఇలా అనేక విషయాలను కూడా పీకేతో చర్చించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఓవైపు టీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకోవడానికే పీకే హైదరాబాద్ వచ్చాడని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.. తెలంగాణ నుంచి వెళ్లిన రెండు మూడు రోజుల్లోనే తాను కాంగ్రెస్ ఆఫర్‌ను తిరస్కరించినట్టు పీకే ప్రకటించడం వెనుక.. కేసీఆర్ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది