హైదరాబాద్, ఏప్రిల్ 27,
రాష్ట్రంలో మండుటెండలను సైతం లెక్క చేయకుండా పనులు చేస్తున్న కూలీలకు రాష్ట్ర సర్కార్ సమ్మర్ అలవెన్స్ ఇవ్వడం లేదు. గత 15 ఏళ్లుగా ప్రతి ఏటా ఇస్తున్న ఈ అలవెన్స్ కు ఈసారి స్వస్తి పలికింది. దీంతో ఎండాకాలంలో పని చేస్తున్న లక్షలాది మంది కూలీలకు రోజువారీ కూలీపై అదనంగా వచ్చే 30 శాతం డబ్బులు అందకుండా పోయాయి. జనవరిలో ప్రకటించాల్సిన సమ్మర్ అలవెన్స్ ను ఇప్పటి వరకు ప్రకటించకపోవడంతో కూలీలు వేలాది రూపాయలను నష్టపోతున్నారు. ఈజీఎస్ సాఫ్ట్ వేర్ మారిందనే సాకుతో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కూలీలకు న్యాయం చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సంవత్సరం వేసవి ప్రారంభానికి ముందు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ అలవెన్స్ ఇస్తుండేది. వారు పని చేసిన కూలీపై ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మేలో 30 శాతం, జూన్ లో 20 శాతం అలవెన్స్ అదనంగా ఇచ్చేవారు. నేరుగా కూలీ డబ్బులతోపాటే అలవెన్స్ జమ అయ్యేది. ఇటీవల కేంద్రం ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీని రూ.237 నుంచి రూ.257కు పెంచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉపాధి కూలీ రోజుకు యావరేజ్ గా రూ.180 నుంచి రూ.200 వరకు వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ అలవెన్స్ ఇచ్చి ఉంటే ఆ కూలీ రూ.240 నుంచి 260 వరకు అందేది. పూర్తి స్థాయిలో పని చేస్తే రూ. 300 వరకు వచ్చేది. కానీ సమ్మర్ అలవెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోవడంతో కూలీలు నష్టపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమ్మర్ అలవెన్స్ ప్రకటించాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో రోజూ ఐదారు లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనులన్ని కంప్లీట్ అయితే రోజుకు 20 లక్షల నుంచి 25 లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతారు. సమ్మర్ లో కూలీలకు ఎండ తగలకుండా పని ప్రదేశాల్లో టెంట్లు వేసేవారు. కొన్నేళ్లుగా టెంట్లు వేయడం మానేశారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఈజీఎస్ సిబ్బంది అందుబాటులో ఉంచడం లేదు. దీంతో కూలీలే ఎవరికివాళ్లు బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు